Social 1080×1350 • Multi-page
13-10-2026 BREAKING NEWS 07:58 PM
swarnodayam.com
Telugu Daily News

చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలి. – మహనీయుల విగ్రహాల పరిరక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి. – ఐలమ్మ జయంతోత్సవ కమిటీ కన్వీనర్ నిమ్మటూరి సాయికృష్ణ డిమాండ్.

చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలి. – మహనీయుల విగ్రహాల పరిరక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి. – ఐలమ్మ జయంతోత్సవ కమిటీ కన్వీనర్ నిమ్మటూరి సాయికృష్ణ డిమాండ్.
IMG-20261013-WA0086

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : తెలంగాణ వీరనారి, సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక, రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహాన్ని మెదక్ పట్టణ నడిబొడ్డున ధ్వంసం చేసిన దుండగులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని చాకలి ఐలమ్మ జయంతోత్సవ కమిటీ కన్వీనర్ నిమ్మటూరి సాయికృష్ణ డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం నాటి భూస్వామ్య పెత్తందారీ వ్యవస్థపై ధైర్యంగా పోరాడిన చాకలి ఐలమ్మ తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. అలాంటి మహనీయురాలి విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేయడం అత్యంత హేయమైన, అమానవీయ చర్య అని తీవ్రంగా ఖండించారు. ఇది కేవలం ఒక విగ్రహంపై జరిగిన దాడి మాత్రమే కాదని, తెలంగాణ పోరాట చరిత్రపై, మహిళా ఆత్మగౌరవంపై, బడుగు బలహీన వర్గాల మనోభావాలపై జరిగిన దాడిగా భావించాలని పేర్కొన్నారు.
సమాజంలో సమానత్వం, ఆత్మగౌరవం, హక్కుల కోసం పోరాడిన మహనీయుల చరిత్రను భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. అలాంటి మహనీయుల విగ్రహాలను ధ్వంసం చేయడం ద్వారా వారి ఆశయాలను చెరిపివేయలేరని, ప్రజల హృదయాల్లో వారి స్థానం ఎప్పటికీ చెక్కుచెదరదని అన్నారు.
ప్రభుత్వం ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి, విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను వెంటనే గుర్తించి అరెస్టు చేయాలని, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా కఠినంగా శిక్షించాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్రంలోని మహనీయుల విగ్రహాలకు రక్షణ కల్పించడంతో పాటు, విగ్రహాలను ధ్వంసం చేసే వారిపై కఠిన శిక్షలు విధించేలా ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
చాకలి ఐలమ్మ చూపిన పోరాట స్ఫూర్తి, ఆత్మగౌరవ మార్గం నేటి తరానికి ఆదర్శమని, ఆమె ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నిమ్మటూరి సాయికృష్ణ పిలుపునిచ్చారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!