అట్రాసిటీ పై చెల్పూర్ లో ఏసిపి మాధవి విచారణ.

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజురాబాద్ మండలం చెల్పూర్ గ్రామ సర్పంచ్ వి. కస్తూరి తనను కులం పేరుతో దూషించారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం హుజరాబాద్ ఏసిపి వాసంశెట్టి మాధవి గ్రామపంచాయతీలో విచారణ జరిపారు.
గత నెల 19న గ్రామపంచాయతీలో జరిగిన సర్వసభ్య సమావేశంలో అభివృద్ధి పనుల బిల్లుల మంజూరు విషయమై సర్పంచ్ వంతడుపుల కస్తూరి, ఉప సర్పంచ్ నేరెళ్ల శ్రీనివాస్ గౌడ్‌ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఉప సర్పంచ్ తనను కులం పేరుతో దూషించారని సర్పంచ్ కస్తూరి హుజురాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ఈ విషయంపై ఆమె గ్రామపంచాయతీలో ఆ రోజు సమావేశంలో జరిగిన గొడవపై సర్పంచ్‌తో పాటు అక్కడున్న మరో ఎనిమిది మంది వార్డు సభ్యుల నుంచి ఏసిపి వాంగ్మూలం నమోదు చేశారు.
—కేసుల నమోదుపై గ్రామస్తుల ఆవేదన
పంచాయతీ పాలకవర్గంలో సర్పంచ్, ఉప సర్పంచ్ ఇద్దరూ చెక్కులపై సంతకాల విషయంలో విభేదాలు వచ్చి జిల్లా కలెక్టర్ వరకు ఫిర్యాదు చేసుకున్నట్లు తెలిసింది. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు రెండు వర్గాలుగా విడిపోవడంతోనే పాలకవర్గంలో అనైక్యత, ఆధిపత్య పోరు కారణంగా సభ్యులు ఒకరిపై ఒకరు తరచూ పోలీస్ కేసులు పెట్టుకుంటుండటంపై గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా వ్యక్తిగత కక్షలు, కేసుల గొడవలు పక్కనపెట్టి గ్రామ అభివృద్ధి కోసం కలిసికట్టుగా పనిచేయాలని పాలకవర్గంలోని అందరినీ గ్రామ ప్రజలు కోరుతున్నారు.

