భక్తి పారవశ్యంలో మునిగితేలిన హుజూరాబాద్… కన్యకా పరమేశ్వరి, భవాని శంకరాలయాలను దర్శించుకున్న తోగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి- అంబికా సమేత భవాని శంకరుడికి, కన్యకా పరమేశ్వరికి వైభవంగా ప్రత్యేక పూజలు

–-వేద మంత్రోచ్ఛారణలు, హరహర మహాదేవ నామస్మరణతో మార్మోగిన ఆలయ ప్రాంగణాలు
—పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి దివ్య ఆశీస్సులు అందుకున్న భక్తజనం
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్ : దైవ చింతనతో, ఆధ్యాత్మిక శోభతో హుజూరాబాద్ పట్టణం పులకించిపోయింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన శ్రీ కన్యకా పరమేశ్వరి మరియు శ్రీ భవాని శంకర మహాదేవాలయాలను తోగుట పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి స్వామి పవిత్ర సందర్శన చేసుకున్నారు. ఆయన రాకతో ఆలయాలు భక్తి ప్రపత్తులతో కళకళలాడాయి.
పూర్ణకుంభ స్వాగతం… భక్తిభావంతో పూజలు:
తోగుట పీఠాధిపతిగా అడుగుపెట్టిన మాధవానంద సరస్వతి స్వామి వారికి ఆలయ అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభంతో సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు. ఆలయంలోకి ప్రవేశించిన స్వామివారు తొలుత జగన్మాత శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లయకారుడైన శ్రీ భవాని శంకర మహాదేవునికి అర్చనలు, అభిషేకాలు నిర్వహించి లోక కల్యాణం కోసం ప్రార్థించారు.


భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు:
తోగుట పీఠాధిపతి విశిష్ట పూజా కార్యక్రమాలను కనులారా తిలకించేందుకు పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. “హర హర మహాదేవ… శంభో శంకర” నామస్మరణతో, భక్తుల జయధ్వనులతో ఆలయ ప్రాంగణాలు మార్మోగాయి. భక్తుల కోలాహలం మధ్య ఆలయమంతా ఆధ్యాత్మిక దివ్య తేజస్సుతో విరాజిల్లుతోంది.
భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు:
భక్తుల భారీ స్పందనను దృష్టిలో ఉంచుకుని ఆలయ కమిటీ సభ్యులు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను అద్భుతంగా పర్యవేక్షించారు. క్యూలైన్ల నిర్వహణ, తాగునీటి సదుపాయం, ప్రసాద వితరణ తదితర ఏర్పాట్లను చక్కగా తీర్చిదిద్దడంతో భక్తులు ప్రశాంత వాతావరణంలో స్వామివారిని దర్శించుకున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి భక్తులందరికీ మంత్రోచ్ఛారణలతో తీర్థప్రసాదాలు అందజేసి, దైవభక్తి, సత్ప్రవర్తన ఆవశ్యకతను తెలియజేస్తూ దివ్య ఆశీర్వచనాలు ప్రసాదించారు.


@@లోకల్ యాడ్స్@@
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ బోరగాల మొగిలి గారు, 29వ వార్డు కౌన్సిలర్, హుజురాబాద్ పురపాలక సంఘం.

