జమ్మికుంటలోని విజయలక్ష్మి జువెల్లరీ వర్క్స్ షోరూమ్‌లో భారీ అగ్నిప్రమాదం..మూడున్నర లక్షల ఆస్తి నష్టం.

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (జమ్మికుంట):జమ్మికుంట పట్టణంలోని విజయలక్ష్మి జువెల్లరీ వర్క్స్ షోరూమ్‌లో సోమవారం ఆకస్మిక అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో షోరూమ్‌లోని విలువైన వెండి వస్తువులు, ఫర్నిచర్ కాలి బూడిదయ్యాయి.
పట్టణానికి చెందిన కాసుల మహేష్, కాసుల కిరణ్కుమార్‌లు నిర్వహిస్తున్న విజయలక్ష్మి జువెల్లరీ వర్క్స్ షోరూమ్‌లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. మంటల తీవ్రతకు షోరూమ్ లోపలి భాగం తీవ్రంగా దెబ్బతిన్నది.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఈ ప్రమాదంలో సుమారు రూ. 3 లక్షల విలువైన 2 కిలోల వెండి వస్తువులు దగ్ధమయ్యాయి. అంతేకాకుండా షోరూమ్‌లోని కౌంటర్ టేబుళ్లు, ఇతర టేబుళ్లు, ఖాతా పుస్తకాలు, లెటర్ ప్యాడ్‌లు మంటల్లో కాలిపోవడంతో ఫర్నిచర్ పరంగా సుమారు రూ. 3.50 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు.
అయితే, ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు, మొత్తం ఆస్తి నష్టం కచ్చితంగా ఎంత జరిగిందనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఊహించని ఈ ప్రమాదంతో షోరూమ్ నిర్వాహకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

