అనుమతి లేకుండా ప్రైవేట్ క్లినిక్ లు నడిపితే కఠిన చర్యలు.. – డిప్యూటీ డిఎంహెచ్ ఓ డాక్టర్ ప్రభుదాస్

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజురాబాద్ డివిజన్ పరిధిలో
అనుమతి లేకుండా ప్రైవేట్ క్లినిక్లు నడపరాదని, అలాంటి వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హుజురాబాద్ డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ ప్రభుదాస్ అన్నారు. శుక్రవారం హుజురాబాద్ పట్టణంలోని గాంధీనగర్ రోడ్డులో గల ప్రియాంక క్లినిక్ లో ఆకస్మికంగా సందర్శించి ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రైవేట్ క్లినిక్ నిర్వహకుడు కుమార్ మండల్ ను పలు ప్రశ్నలు అడిగారు. ఆయుర్వేద ఆస్పత్రి పూడపాలంటే తప్పనిసరిగా సర్టిఫికెట్ ఉండాలని, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అనుమతి లేని సర్టిఫికెట్ తో ఇక్కడ వైద్యం చేయరాదనీ అన్నారు. అర్హత, అనుమతి లేకుండా ఆసుపత్రి నడపడం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటమేనని ఆయన అన్నారు. ఆకర్షణీయమైన ఆసుపత్రి బోర్డులను తొలగించాలని ఆయన ఆదేశించారు. ప్రతి ప్రవేట్ క్లినిక్ నిర్వాహకులు తప్పనిసరిగా డిఆర్ఏ చట్టప్రకారము రిజిస్ట్రేషన్ చేసుకోవాలని రిజిస్ట్రేషన్ కాలం పూర్తయిన వారు తిరిగి రెన్యువల్ చేయించుకోవాలని లేని పక్షంలో ఆసుపత్రులు జరిమానాతో పాటు సీజ్ చేయబడునని చెప్పారు. కొత్తగా ప్రవేట్ క్లినిక్లు నడిపేవారు తప్పనిసరిగా డాక్టర్ల అర్హత పత్రాలు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ పత్రాలు పారామెడికల్ స్టాఫ్ తెలంగాణ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయిన వారు మాత్రమే అర్హులని అన్నారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా డిఆర్ఏ అనుమతి తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలు పాటించాలని ఆయన తెలిపారు. తప్పనిసరిగా జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాల మేరకు బయో వేస్ట్ మేనేజ్మెంట్ డిస్టిక్ ఫైర్ ఆఫీసు నుండి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ సమర్పించాలని అన్నారు. ఆసుపత్రి మూసి వేయాలని తెరిచినట్లు మరో సారి పిర్యాదు వస్తే కేసు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ తనిఖీలో జిల్లా ఆరోగ్య బోధకులు పంజాల ప్రతాప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

