Social 1080×1350 • Multi-page
24-10-2026 BREAKING NEWS 12:57 PM
swarnodayam.com
Telugu Daily News

దైవదర్శనానికి వెళ్లి ఇద్దరు యువకుల దుర్మరణం.. ఐదుగురికి తీవ్ర గాయాలు.

దైవదర్శనానికి  వెళ్లి ఇద్దరు యువకుల దుర్మరణం.. ఐదుగురికి తీవ్ర గాయాలు.
IMG-20261024-WA0039

–లారీని వెనుక నుంచి ఢీకొట్టిన కారు..అక్కడికక్కడే ఇద్దరు యువకుల దుర్మరణం, మరో ఐదుగురికి తీవ్ర గాయాలు

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, అక్టోబర్ 24: ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని సంతోషంగా తిరుగు ప్రయాణమైన ఆ యువకులను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. ముందు వెళ్తున్న లారీని వారు ప్రయాణిస్తున్న కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకుల (ఫైల్⁹)ఫోటోలు.

ఈ విషాద ఘటన శనివారం తెల్లవారుజామున హుజురాబాద్ మండలం రంగాపూర్ శివారులోని 563వ నంబర్ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. రూరల్ సీఐ వి శ్రీనివాస్, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా రామగుండానికి చెందిన ఏడుగురు యువకులు ఎర్టిగా కారులో విజయవాడ వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం తిరిగి నిన్న సాయంత్రం స్వగ్రామానికి పయనమయ్యారు. వీరి కారు రంగాపూర్ శివారులోకి చేరుకోగానే జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం లారీ కిందకు దూసుకెళ్లి పూర్తిగా నుజ్జునుజ్జు అయింది.

ఈ దుర్ఘటనలో రామగుండానికే చెందిన బట్టారి అరవింద్ (20), మచ్చ సాయి (20) అనే ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడి కారులోనే ప్రాణాలు విడిచారు. కారులో ఉన్న మిగతా ఐదుగురు ఎరుకల సాయికృష్ణ, మచ్చ ఆదర్శ్, ముఖియా, వివేక్, శ్రీకర్లకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే హుజురాబాద్ రూరల్ సిఐ వీరబత్తిని శ్రీనివాస్ తమ సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు గంటల పాటు పోలీసులు, హుజురాబాద్ హెల్ప్ టీం యువకులు హర్షద్, షఫీ, నేహాల్, ఇర్ఫాన్ తదితరులు శ్రమించి క్షతగాత్రులను బయటకు తీశారు. కారు పూర్తిగా లారీ కింద ఇరుక్కు పోవడంతో క్రేన్ను రప్పించారు. స్థానికుల సహాయంతో సుమారు రెండు గంటల పాటు శ్రమించి మృతదేహాలను, క్షతగాత్రులను బయటకు తీశారు. అనంతరం హైవేపై నిలిచిపోయిన ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. గాయపడిన ఐదుగురిని హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అయితే వారి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి మరో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో హైదరాబాద్ కు తరలించినట్లు తెలుస్తోంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ వి శ్రీనివాస్ వెల్లడించారు. ఈ ఘటనతో మృతుల స్వగ్రామం రామగుండంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇటీవల దసరా సందర్భంగా దుర్గాదేవిని ఏర్పాటు చేసి భవాని మాల వేసుకున్న యువకులు మాల విరమించేందుకు విజయవాడ వెళ్ళినట్లు తెలిసింది. తిరుగు ప్రయాణంలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకోవడం అత్యంత బాధాకరం.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!