Telugu Daily News
ప్యారడైజ్ హోటల్‌కు రూ. 20 వేల జరిమానా.. నీటి వృథాయే కారణం!

స్వర్ణోదయం ప్రతినిధి హైదరాబాద్: తాగునీటిని వృథా చేసిన ప్రముఖ ప్యారడైజ్ హోటల్‌కు హైదరాబాద్ నీటి సరఫరా, మురుగునీటి పారుదల మండలి (జలమండలి) షాక్ ఇచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా నీటిని వృథా చేస్తున్నందుకు రూ.20,000 జరిమానా విధించింది.
తనిఖీల్లో వెలుగులోకి..
ఖైరతాబాద్ జోన్ పరిధిలోని డివిజన్-16 జలమండలి అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో హోటల్ ప్రాంగణంలో భారీగా తాగునీరు వృథా అవుతున్నట్లు గుర్తించారు. దీంతో తక్షణ చర్యల కింద రూ. 20 వేల ఫైన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
జలమండలి తీవ్ర హెచ్చరిక:
భవిష్యత్తులో నీటిని పొదుపుగా వాడాలని, వృథా అరికట్టాలని హోటల్ యాజమాన్యానికి అధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రాబోయే రోజుల్లో ఎవరైనా తాగునీటిని వృథా చేస్తే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తప్పవని జలమండలి ఈ సందర్భంగా హెచ్చరించింది.
