అత్యవసర సమయంలో ‘ఓ నెగటివ్’ రక్తదానం చేసి ఆపద్బాంధవుడిగా నిలిచిన రామచంద్రం

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (జమ్మికుంట):
ఆపదలో ఉన్న వారికి సమయానికి రక్తదానం చేసి ఒక నిండు ప్రాణాన్ని కాపాడి ఆదర్శంగా నిలిచారు కాంగ్రెస్ పార్టీ చేనేత సెల్ రాష్ట్ర కార్యదర్శి రామచంద్రం.
వివరాల్లోకి వెళితే… కరీంనగర్ జిల్లా, వీణవంక మండలం, కనపర్తి గ్రామానికి చెందిన ఎన్. సాయమ్మ అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. వైద్యుల సూచన మేరకు ఆమెకు అత్యవసరంగా అరుదైన ‘ఓ నెగటివ్’ (O Negative) గ్రూపు రక్తం అవసరమైంది. విషయం తెలుసుకున్న కూరపాటి రామచంద్రం వెంటనే స్పందించి, జమ్మికుంటలోని అమృత హాస్పిటల్ సమీపంలో గల స్పందన బ్లడ్ సెంటర్కు చేరుకుని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.
అరుదైన గ్రూపు రక్తాన్ని సకాలంలో అందించి పేషెంట్ ప్రాణాలు కాపాడిన దాత రామచంద్రంను బ్లడ్ సెంటర్ నిర్వాహకులు, రోగి బంధువులు ప్రత్యేకంగా అభినందించారు.
స్పందన బ్లడ్ సెంటర్ పిలుపు:
ఈ సందర్భంగా స్పందన బ్లడ్ సెంటర్ ప్రతినిధులు మాట్లాడుతూ… “పుట్టినరోజులు, పెళ్లిరోజులు వంటి ప్రత్యేక సందర్భాలలో రక్తదానం చేయండి. మీ ఆ ఒక్కరోజు ఆనందం, మరొకరికి పునర్జన్మ అవుతుంది. రక్తదానం చేసి ఒక గుండె చప్పుడు ఆగకుండా కాపాడండి” అని యువతకు, దాతలకు పిలుపునిచ్చారు.
అత్యవసర సమయాల్లో రక్తం కావలసిన వారు లేదా రక్తదానం చేయాలనుకునే దాతలు జమ్మికుంటలోని స్పందన బ్లడ్ సెంటర్ను (ఫోన్ నంబర్: 9550658488) సంప్రదించాలని కోరారు.
