Social 1080×1350 • Multi-page
20-11-2026 BREAKING NEWS 09:13 PM
swarnodayam.com
Telugu Daily News

కలెక్టర్ గారూ.. చావకముందే పింఛన్ మంజూరు చేయండి!​ -సదరం సర్టిఫికెట్ కోసం పదేళ్లుగా ఓ వికలాంగుడి అరణ్యరోదన​ -60 శాతం వైకల్యం ఉన్నట్లు నిర్ధారించినా అందని ధ్రువీకరణ పత్రం​ – న్యాయం జరగకపోతే భార్యాబిడ్డలతో కలిసి ఆమరణ దీక్షకు దిగుతానని హెచ్చరిక

కలెక్టర్ గారూ.. చావకముందే పింఛన్ మంజూరు చేయండి!​ -సదరం సర్టిఫికెట్ కోసం పదేళ్లుగా ఓ వికలాంగుడి అరణ్యరోదన​ -60 శాతం వైకల్యం ఉన్నట్లు నిర్ధారించినా అందని ధ్రువీకరణ పత్రం​ – న్యాయం జరగకపోతే భార్యాబిడ్డలతో కలిసి ఆమరణ దీక్షకు దిగుతానని హెచ్చరిక
IMG-20261120-WA0133

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి
​హుజురాబాద్, నవంబర్ 21:
వైకల్యం ఒకవైపు.. పేదరికం మరోవైపు.. వీటికి తోడు ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం ఆ నిరుపేద కుటుంబాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. తనకు రావాల్సిన వికలాంగుల పింఛన్ కోసం ఓ వృద్ధుడు గత పదేళ్లుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా కనికరించే నాథుడే కరువయ్యాడు. “కలెక్టర్ గారూ.. కనీసం నేను చావకముందైనా నాకు పింఛన్ మంజూరు చేయండి” అంటూ ఆయన పడుతున్న ఆవేదన చూపరుల హృదయాలను కలచివేస్తోంది.

అసలేం జరిగింది?
హుజురాబాద్ మండలం, రాంపూర్ గ్రామ శివారులోని కొత్త దయానగర్ కాలనీకి చెందిన ముషం యాదగిరి (61) కూలీ, మెకానిక్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. 2014లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం ఆయన జీవితాన్ని తలకిందులు చేసింది. ఈ ప్రమాదంలో ఆయన కుడికాలు మోకాలి కింది భాగంలో, తుంటి భాగంలో ఎముకలు తీవ్రంగా విరిగాయి. హనుమకొండలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేసిన వైద్యులు కాలిలో రెండు చోట్ల రాడ్స్ అమర్చారు. నెలల తరబడి మంచానికే పరిమితమైన యాదగిరి, ఆ తర్వాత శాశ్వత వికలాంగుడిగా మారిపోయాడు.
​పదేళ్లుగా సదరం సర్టిఫికెట్ కోసం నిరీక్షణ:
వికలాంగుల పింఛన్ పొందాలంటే సదరం (SADAREM) సర్టిఫికెట్ తప్పనిసరి అని తెలుసుకున్న యాదగిరి, 2015-16లో హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన సదరం క్యాంపునకు హాజరయ్యారు. ఆయన ఎక్స్-రే రిపోర్టులు, ఆపరేషన్ వివరాలు పరిశీలించిన వైద్యులు, యాదగిరికి 60 శాతం వైకల్యం ఉన్నట్లు నిర్ధారించి (సదరం ఐడి: 20251490100314156) త్వరలోనే ఒరిజినల్ సర్టిఫికెట్ ఇస్తామని చెప్పారు. కానీ ఆ ‘త్వరలో’ అనే మాట పదేళ్లు గడిచినా కార్యరూపం దాల్చలేదు. తన కళ్లముందే ఎంతోమంది సర్టిఫికెట్లు తెచ్చుకుని ఏళ్ల తరబడి పింఛన్లు తీసుకుంటున్నా, అధికారుల అలసత్వం వల్ల తనకు మాత్రం అన్యాయం జరుగుతోందని యాదగిరి కన్నీటిపర్యంతమయ్యారు.
​శిథిలమైన ఇల్లు.. భారమైన బతుకు:
ప్రస్తుతం యాదగిరి కుటుంబ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. వృద్ధాప్యంతో తల్లిదండ్రులు మరణించగా, ఇద్దరు కూతుళ్లు (స్వప్న, అశ్విని), భార్య కవితతో కలిసి ఉంటున్నారు. కవిత బీడీలు చుడుతూ సంపాదించే కొద్దిపాటి డబ్బుతోనే ఆ కుటుంబం అర్ధాకలితో కాలం వెళ్లదీస్తోంది. వీరికి ఉన్న రెండే రెండు గదుల పెంకుటిల్లు నాలుగేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలకు సగం కూలిపోయింది. మిగిలిన ఆ ఒక్క ఇరుకు గదిలోనే బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు.
​అధికారులకు విజ్ఞప్తి – ఆమరణ దీక్ష హెచ్చరిక:
“నాకు వయసు మీద పడింది. కాలిలో రాడ్స్ ఉండటంతో నడవలేకపోతున్నాను. ఇకపై ఆఫీసుల చుట్టూ తిరిగే ఓపిక, ఆర్థిక స్తోమత నాకు లేవు. అధికారులు తలుచుకుంటే పది నిమిషాల్లో నా సమస్య పరిష్కారమవుతుంది” అని యాదగిరి ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్, హుజురాబాద్ ఆర్డీవో తక్షణమే స్పందించి మానవతా దృక్పథంతో తనకు సదరం సర్టిఫికెట్ జారీ చేసి, పింఛన్ మంజూరు చేయాలని వేడుకున్నారు. లేనిపక్షంలో తన భార్యాబిడ్డలతో కలిసి కలెక్టరేట్ ఎదుట ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని ఆయన స్పష్టం చేశారు.

Reporter

  • Mandala Yadagiri

    Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!