Social 1080×1350 • Multi-page
20-11-2026 BREAKING NEWS 10:30 PM
swarnodayam.com
Telugu Daily News

360 డిగ్రీల సర్వేతో పేదలకు అన్యాయమా?. -ప్రభుత్వాన్ని నిలదీసిన బీఎస్పీ నేత మహేందర్ గిన్నారపు

360 డిగ్రీల సర్వేతో పేదలకు అన్యాయమా?. -ప్రభుత్వాన్ని నిలదీసిన బీఎస్పీ నేత మహేందర్ గిన్నారపు
IMG-20261120-WA0111

—పట్టించుకోని ప్రతిపక్షం.. పట్టింపులేని పాలకపక్షం!

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, నవంబర్ 20: పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని గొప్పగా ప్రకటిస్తున్న పాలకులు క్షేత్రస్థాయిలో అర్హులైన నిరుపేదలకు న్యాయం చేయడంలో విఫలమవుతున్నారా? ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రతిపక్షాలు సైతం మౌనం వహిస్తున్నాయా? అంటూ హుజురాబాద్ నియోజకవర్గంలో సంక్షేమ పథకాల అమలుపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం చేపట్టిన 360 డిగ్రీల సర్వే, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పింఛన్ల అర్హతల విషయంలో నెలకొన్న గందరగోళం పేద కుటుంబాలను ఆందోళనకు గురిచేస్తోందని బీఎస్పీ హుజురాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు, జూపాక ఉపసర్పంచ్ మహేందర్ గిన్నారపు ఆవేదన వ్యక్తం చేశారు.

ఒక పథకం లబ్ధి పొందితే.. మిగతా సంక్షేమ పథకాలకు దూరం చేయాలా?

గతంలో దళితబంధు పథకం ద్వారా ఆర్థిక సహాయం పొందిన కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు వంటి ఇతర సంక్షేమ పథకాల విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయని మహేందర్ గిన్నారపు పేర్కొన్నారు. ఒకసారి ప్రభుత్వ పథకం ద్వారా లబ్ధి పొందినంత మాత్రాన ఆ కుటుంబం పూర్తిగా ఆర్థికంగా స్థిరపడినట్లేనా? ఆ కుటుంబానికి ఇకపై ప్రభుత్వ సహాయం అవసరం లేదా? అని ప్రశ్నించారు. ప్రతి సంక్షేమ పథకానికి ప్రత్యేక అర్హతలు, మార్గదర్శకాలు ఉంటాయని, ఒక పథకం లబ్ధిని మరో పథకానికి అనర్హతగా పరిగణిస్తే అందుకు సంబంధించిన ప్రభుత్వ నిబంధనలను ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని డిమాండ్ చేశారు.

—360 డిగ్రీల సర్వే.. పేదరికాన్ని కొలిచే కొలమానమా?

నిజమైన పేదలను గుర్తించి సంక్షేమ ఫలాలు అందించడమే సర్వే లక్ష్యమా? లేక గతంలో పొందిన ప్రభుత్వ పథకాలు, భూములు, ఆస్తుల ఆధారంగా నిరుపేదలను అనర్హులుగా గుర్తించడమా? అని ఆయన ప్రశ్నించారు. ఎకరం భూమి ఉన్నంత మాత్రాన ఆ కుటుంబం ఆర్థికంగా బలంగా ఉన్నట్లు కాదని, సాగునీరు లేక పంటలు పండక అప్పుల ఊబిలో చిక్కుకున్న రైతు కుటుంబాల పరిస్థితిని కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. కుటుంబ ఆదాయం, ఉపాధి, అప్పులు, కుటుంబ సభ్యుల సంఖ్య, జీవన పరిస్థితులను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే అర్హతలను నిర్ణయించాలని కోరారు.

—ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో పారదర్శకత ఎక్కడ?

ఇల్లు లేని నిరుపేదలకు సొంత గూడు కల్పించాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో నిజమైన అర్హులకు ప్రాధాన్యత కల్పించాలని మహేందర్ గిన్నారపు డిమాండ్ చేశారు. లబ్ధిదారుల ఎంపికలో అనుసరిస్తున్న నిబంధనలను బహిర్గతం చేయాలని, అర్హుల జాబితా నుంచి తొలగించిన కుటుంబాలకు అందుకు గల కారణాలను తెలియజేయాలని కోరారు. సర్వేలో పొరపాట్లు జరిగితే సరిదిద్దుకునే అవకాశం కల్పించాలని, అర్హత ఉన్నప్పటికీ పథకాల ప్రయోజనాలు అందని కుటుంబాలపై మరోసారి క్షేత్రస్థాయి విచారణ చేపట్టాలని సూచించారు.

—పాలకపక్షం సమాధానం చెప్పాలి.. ప్రతిపక్షం గొంతెత్తాలి!

ప్రజలకు కావాల్సింది రాజకీయ ప్రసంగాలు, ఎన్నికల హామీలు కాదని.. తమకు అందాల్సిన సంక్షేమ ఫలాలని ఆయన స్పష్టం చేశారు. 360 డిగ్రీల సర్వేలో అనుసరిస్తున్న ప్రమాణాలు ఏమిటో ప్రభుత్వం ప్రజలకు వివరించాలని, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో ఎలాంటి వివక్షకు తావులేకుండా చూడాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై పాలకపక్షాన్ని ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు కూడా తమ బాధ్యతను గుర్తించి పేదల పక్షాన నిలబడాలని పిలుపునిచ్చారు.

—పేదల సంక్షేమం రాజకీయాలకు బలి కావద్దు!

సామాజిక న్యాయం అనేది ఎన్నికల సమయంలో ఇచ్చే హామీగా మిగిలిపోకూడదని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందాలని మహేందర్ గిన్నారపు పేర్కొన్నారు. అనర్హులకు లబ్ధి చేకూరకుండా చర్యలు తీసుకోవడంతో పాటు, ఒక్క అర్హుడికి కూడా అన్యాయం జరగకుండా ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.
చివరగా ప్రభుత్వానికి ఆయన సంధించిన ప్రశ్న ఒక్కటే.. 360 డిగ్రీల సర్వే పేదల జీవితాల్లో వెలుగులు నింపడానికా? లేక వారికి అందాల్సిన సంక్షేమ పథకాలకే అడ్డుగోడగా మారడానికా?
ఈ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని, హుజురాబాద్ నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని బీఎస్పీ నేత మహేందర్ గిన్నారపు డిమాండ్ చేశారు.

Reporter

  • Mandala Yadagiri

    Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!