ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం – అరాచకవాదాన్ని అంతం చేద్దాం!

—ఎస్‌ఐఆర్‌పై దుష్ప్రచారాన్ని తిప్పికొడదాం – కరీంనగర్ బీజేపీ మహాపాదయాత్రను విజయవంతం చేద్దాం!
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని బీజేపీ నాయకులు విమర్శించారు. ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 23న కరీంనగర్‌లో నిర్వహించనున్న మహాపాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ మహాపాదయాత్రకు సంబంధించి భారతీయ జనతా పార్టీ హుజూరాబాద్ పట్టణ, మండల శాఖల ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బీజేపీ సంస్థాగత రాష్ట్ర సంయుక్త ప్రధాన కార్యదర్శి దశరథ్ జీ, బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి హాజరయ్యారు.
ఎస్‌ఐఆర్‌పై ప్రజల్లో అపోహలు సృష్టించకుండా, ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు సరైన అవగాహన కల్పించాలని సూచించారు.

కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తమ ఐక్యతను చాటాలని, కరీంనగర్‌లో జరిగే మహాపాదయాత్రను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
ఈ మహాపాదయాత్రలో బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ పాల్గొననున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా తరలిరావాలని కోరారు. హుజూరాబాద్ పట్టణ, మండల శాఖల నాయకులు, వివిధ మోర్చాల ప్రతినిధులు, శక్తి కేంద్రాల ఇన్‌చార్జులు, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ
హుజూరాబాద్ పట్టణ, మండల శాఖ అధ్యక్షులు తూర్పాటి రాజు, పారుపల్లి కొండల్ రెడ్డి, కౌన్సిలర్లు, సర్పంచులు, మాజీ అధ్యక్షులు, జిల్లా పదాధికారులు, పట్టణ పదాధికారులు, భూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇంచార్జిలు తదితరులు పాల్గొన్నారు.
