చెల్పూర్‌లో హోరాహోరీగా రాష్ట్రస్థాయి టచ్ రగ్బీ పోటీలు. – తెలంగాణ వ్యాప్తంగా 600 మంది క్రీడాకారులు, ప్రతినిధుల రాక – నవంబర్ 23 వరకు కొనసాగనున్న 2వ అంతర్ జిల్లా ఛాంపియన్‌షిప్

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్ (చెల్పూర్), నవంబర్ 21:
కరీంనగర్ జిల్లా చెల్పూర్ గ్రామం రాష్ట్రస్థాయి క్రీడా సంబరానికి వేదికైంది. కరీంనగర్ జిల్లా రగ్బీ అసోసియేషన్ ఆధ్వర్యంలో, తెలంగాణ టచ్ రగ్బీ అసోసియేషన్ సహకారంతో నిర్వహిస్తున్న ‘రెండవ అంతర్ జిల్లా రాష్ట్రస్థాయి టచ్ రగ్బీ ఛాంపియన్‌షిప్ – 2026’ పోటీలు స్థానిక PM SHRI ZPHS పాఠశాల క్రీడా మైదానంలో ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగుతున్నాయి. నవంబర్ 20న ప్రారంభమైన ఈ మెగా టోర్నమెంట్ ఈ నెల 23 వరకు జరగనుంది.
క్రీడాకారుల ప్రతిభా పాటవాలు:
ఈ రాష్ట్రస్థాయి పోటీల్లో తెలంగాణలోని అన్ని జిల్లాల నుండి సుమారు 600 మంది క్రీడాకారులు, కోచ్‌లు, క్రీడా ప్రతినిధులు పాల్గొంటున్నారు. వివిధ విభాగాల్లో జరుగుతున్న మ్యాచ్‌లలో క్రీడాకారులు కనబరుస్తున్న వేగం, నైపుణ్యం స్థానిక క్రీడాభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

అతిథుల ప్రోత్సాహం:
పోటీలను తిలకించేందుకు విచ్చేసిన ముఖ్య అతిథులు ఎస్ఐ రవి, చెల్పూర్ సర్పంచ్ వంతడుపుల కస్తూరి, సాన్వి చైర్మన్ మణిందర్ శెట్టి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనురాధ, మాజీ సర్పంచ్ పి.శ్రీనివాస్ రెడ్డి, కరీంనగర్ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్. సారయ్య, కె. రాజిరెడ్డి, హెచ్ఎం ప్రతాప్ రెడ్డి, రిటైర్డ్ పీడీలు, వార్డు సభ్యులు క్రీడాకారులను పరిచయం చేసుకుని అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని, క్రీడల వల్ల యువతలో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, జట్టుకృషి పెంపొందుతాయని పేర్కొన్నారు.
నిర్వాహకుల కృషి:
రగ్బీ క్రీడను గ్రామీణ స్థాయి నుండి జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ టోర్నమెంట్ ద్వారా చెల్పూర్ గ్రామానికి రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించిందని హర్షం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా రగ్బీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రంగు నిరంజన్ చారి, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు చిరుత శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్వేత శ్రీనివాస్ తదితరులు పోటీలను పర్యవేక్షిస్తున్నారు.
