Social 1080×1350 • Multi-page
22-11-2026 BREAKING NEWS 09:59 PM
swarnodayam.com
Telugu Daily News

నిజమైన తెలంగాణ ఉద్యమకారులకు తక్షణమే న్యాయం చేయాలి.. -ఆన్‌లైన్ దరఖాస్తుల కోసం ప్రత్యేక వెబ్‌సైట్ ప్రారంభించాలని డిమాండ్.

నిజమైన తెలంగాణ ఉద్యమకారులకు తక్షణమే న్యాయం చేయాలి.. -ఆన్‌లైన్ దరఖాస్తుల కోసం ప్రత్యేక వెబ్‌సైట్ ప్రారంభించాలని డిమాండ్.
IMG-20261122-WA0094

—ఎమ్మెల్సీ ఆచార్య కోదండరాంకు వినతిపత్రం సమర్పించిన ఉద్యమకారులు

స్వర్ణోదయం ప్రతినిధి ​హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాడిన నిజమైన ఉద్యమకారులను గుర్తించి, ఎన్నికల హామీ మేరకు ఎటువంటి జాప్యం లేకుండా తక్షణమే న్యాయం చేయాలని తెలంగాణ ఉద్యమకారులు ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ జన సమితి (టీజేఎస్) రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఎమ్మెల్సీ మరియు ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యులు ఆచార్య కోదండరాంను పలువురు ఉద్యమకారులు మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు.

​గత ప్రభుత్వంపై విమర్శలు, ప్రస్తుత పరిస్థితులపై ఆవేదన

ఈ సందర్భంగా ఉద్యమకారులు మాట్లాడుతూ.. అమరుల త్యాగాలు, ఉద్యమకారుల సుదీర్ఘ పోరాటం, సోనియా గాంధీ సాహసోపేత నిర్ణయంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. అయితే, రాష్ట్ర ఏర్పాటు తర్వాత అధికారంలోకి వచ్చిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమకారులకు కనీస గుర్తింపు ఇవ్వకపోగా, అవమానించిందని వారు ఆరోపించారు. ప్రస్తుతం ఎందరో ఉద్యమకారులు ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, కుటుంబ పరమైన ఒత్తిళ్లతో దుర్భర స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని, ఇటీవల ఇద్దరు ఉద్యమకారులు ఆత్మహత్యలకు పాల్పడటం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

​ఉద్యమకారుల ప్రధాన డిమాండ్లు:

  • ​ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉద్యమకారులు దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా తక్షణమే ప్రత్యేక ఆన్‌లైన్ వెబ్‌సైట్‌ను ప్రారంభించాలి.
  • ​ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో వివిధ సంఘాల తరఫున పాల్గొన్న ఉద్యమకారులు, నాయకులను నిష్పక్షపాతంగా గుర్తించాలి.
  • ​ఉద్యమకారుల గుర్తింపు కమిటీ తక్షణమే స్పందించి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం ద్వారా ప్రజా ప్రభుత్వంలో నిజమైన ఉద్యమకారులకు న్యాయం జరిగేలా చూడాలి.

​ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్, జేఏసీ జిల్లా మాజీ అధికార ప్రతినిధి కప్పాటి పాండురంగా రెడ్డి, బీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి గడ్డం వెంకట్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ బొల్లారం వెంకట్ రెడ్డి, ఆర్.కె., సంతోష్ ముదిరాజ్, రాజ్ కుమార్, యాతం బాల్ రాజ్ యాదవ్, కిరణ్ కుమార్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Mandala Yadagiri

    Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!