నవంబర్ 29న కరీంనగర్లో భారీ ఎత్తున దీక్షా దివస్ కార్యక్రమం.. – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరు.. – ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

—హుజురాబాద్ అభివృద్ధికి రూ.1,000 కోట్లు కేటాయించాలి.. పెన్షన్లపై రేవంత్ రెడ్డికి బహిరంగ సవాల్ – ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ గారు చేపట్టిన చారిత్రాత్మక ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా నవంబర్ 29న కరీంనగర్‌లోని అలుగునూరు చౌరస్తా సమీపంలో వేలాది మందితో భారీ ఎత్తున దీక్షా దివస్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సోమవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్ గారు చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని, ఆ చరిత్రను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు విస్తృత ప్రచారం నిర్వహించి ప్రజలను పెద్ద ఎత్తున తరలించాలని పిలుపునిచ్చారు.
మండలాలవారీగా దీక్షా దివస్ సన్నాహక సమావేశాలు:
బీఆర్ఎస్ సమన్వయ కమిటీ నిర్ణయం మేరకు సమావేశాల వివరాలు:
- నవంబర్ 25, ఉదయం 10 గంటలకు: జమ్మికుంట సాయి గార్డెన్లో జమ్మికుంట పట్టణం, జమ్మికుంట, ఇల్లంతకుంట మండలాల సమావేశం.
- నవంబర్ 25, మధ్యాహ్నం 3 గంటలకు: వీణవంక మండల కేంద్రంలో సమావేశం.
- నవంబర్ 27, ఉదయం 10 గంటలకు: హుజురాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హుజురాబాద్ పట్టణం, మండల సమావేశం.
- నవంబర్ 27, మధ్యాహ్నం 3 గంటలకు: కమలాపూర్ మండలంలో సమావేశం.
ప్రతి బీఆర్ఎస్ నాయకుడు, కార్యకర్త, కేసీఆర్ అభిమానులు, తెలంగాణ ఉద్యమకారులు ఈ సమావేశాలకు హాజరై దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలని చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు.

పెన్షన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అన్యాయం చేస్తోంది
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హుజురాబాద్ నియోజకవర్గంలో కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన 5,250 పెన్షన్లను తొలగించి, కేవలం 4,221 మాత్రమే మంజూరు చేసిందని ఎమ్మెల్యే ఆరోపించారు. దీంతో నికరంగా 1,029 పెన్షన్లు తగ్గాయని తెలిపారు.
మండలాలవారీగా పెన్షన్ల వివరాలు:
- హుజురాబాద్ మండలం: 694 తొలగింపు – 603 మంజూరు.
- జమ్మికుంట మండలం: 644 తొలగింపు – 553 మంజూరు.
- కమలాపూర్ మండలం: 1,425 తొలగింపు – 954 మంజూరు.
- వీణవంక మండలం: 744 తొలగింపు – 561 మంజూరు.
- ఇల్లంతకుంట మండలం: 726 తొలగింపు – 428 మంజూరు.
- జమ్మికుంట పట్టణం: 577 తొలగింపు – 582 మంజూరు.
- హుజురాబాద్ పట్టణం: 440 తొలగింపు – 540 మంజూరు.
కేసీఆర్ ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్‌తో మరణించిన లబ్ధిదారుల స్థానంలో మంజూరైన పెన్షన్లను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఘనతగా ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. కొత్తగా ఎంత బడ్జెట్ కేటాయించారు? ఎన్ని కొత్త పెన్షన్లు మంజూరు చేశారు? అనే లెక్కలను ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు.
నా స్వగ్రామం వీణవంకలోనే అర్హులకు పెన్షన్లు ఇవ్వలేదు
తన స్వగ్రామమైన వీణవంకలో అర్హులైన వారికే పెన్షన్లు ఇవ్వకుండా ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.
- వితంతు పెన్షన్లకు 21 మంది దరఖాస్తు చేసుకోగా 16 మందికే మంజూరు చేశారు.
- సింగిల్ ఉమెన్ పెన్షన్లకు అర్హులైన 8 మందిలో కేవలం ముగ్గురికే ఇచ్చారు.
- గీత కార్మికుల విభాగంలో 10 మందికి అర్హత ఉండగా నలుగురికే మంజూరు చేశారు.
- వృద్ధాప్య పెన్షన్ల కోసం 68 మంది దరఖాస్తు చేసుకోగా, 52 మందిని అర్హులుగా గుర్తించినప్పటికీ వారికి పెన్షన్లు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
73 పెన్షన్లు తొలగించి కేవలం 28 మాత్రమే ఇచ్చి తల లేని వాళ్ళు కొందరు గొప్పలు చెప్పుకోవడం ఏమిటని నిలదీశారు.
హుజురాబాద్ నియోజకవర్గంలో దళితులకు అర్హత ఉన్నప్పటికీ సింగిల్ ఉమెన్, వితంతు పెన్షన్లు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. దళిత బంధు ఇచ్చామని చెప్పి ఇతర సంక్షేమ పథకాలకు దూరం చేస్తారా? అని నిలదీశారు. హుజురాబాద్ పట్టణంలో కూడా సుమారు 800 మంది అర్హులైన దరఖాస్తుదారులకు పెన్షన్లు మంజూరు చేయలేదని విమర్శించారు.
57 ఏళ్లకే పెన్షన్ ఇచ్చిన కేసీఆర్.. రూ.4,000 హామీ ఏమైంది?
కేసీఆర్ ప్రభుత్వం 57 సంవత్సరాలు నిండిన వారికి ఆసరా పెన్షన్లు అందించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 70 ఏళ్లు దాటిన వారికి మాత్రమే పెన్షన్లు అందించే పరిస్థితి తీసుకొచ్చిందని విమర్శించారు.
కేసీఆర్ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 45 లక్షల మందికి, హుజురాబాద్ నియోజకవర్గంలో సుమారు 45 వేల మందికి పెన్షన్లు అందాయని గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో రూ.200గా ఉన్న పెన్షన్‌ను రూ.2,000కు, వికలాంగుల పెన్షన్‌ను రూ.500 నుంచి రూ.4,000కు పెంచిన ఘనత కేసీఆర్‌దేనన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో రూ.2,000 పెన్షన్‌ను రూ.4,000కు, వికలాంగుల పెన్షన్‌ను రూ.6,000కు పెంచుతామని హామీ ఇచ్చి ఇప్పటికీ అమలు చేయలేదని మండిపడ్డారు. 2023 ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ వీడియోలను ప్రజలకు చూపిస్తానని తెలిపారు.
రేవంత్ రెడ్డికి బహిరంగ సవాల్.. వీణవంకకు రండి!
హుజురాబాద్ నియోజకవర్గంలో కేసీఆర్ ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్‌తో వచ్చిన పెన్షన్లు కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఒక్క పెన్షన్ అయినా మంజూరు చేసినట్లు నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరినైనా మంత్రిని, అధికారులను పంపించుకోవచ్చని, వీణవంక గ్రామానికి వచ్చి గ్రామ పంచాయతీ రికార్డులతో పెన్షన్ల లెక్కలు పరిశీలించుకోవచ్చని అన్నారు. తాను చెప్పిన లెక్కల్లో ఒక్కటి తప్పని నిరూపించినా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.
కొడంగల్‌కు రూ.10 వేల కోట్లు.. హుజురాబాద్‌కు రూ.1,000 కోట్లు ఎందుకు ఇవ్వరు?
హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి అసెంబ్లీ వేదికగా పలుమార్లు నిధులు కోరినా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే విమర్శించారు.
కేసీఆర్ హయాంలో నియోజకవర్గంలోని గ్రామాలు, పట్టణాల్లో రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు, వైకుంఠధామాలు తదితర మౌలిక సదుపాయాలు కల్పించారని తెలిపారు.
కొడంగల్ నియోజకవర్గానికి రూ.10 వేల కోట్లు కేటాయిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుజురాబాద్ నియోజకవర్గానికి కనీసం రూ.1,000 కోట్లు ఎందుకు కేటాయించడం లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేవలం కొడంగల్‌కే కాదని, తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలకు ముఖ్యమంత్రి అని గుర్తుంచుకోవాలన్నారు.
హుజురాబాద్ ప్రజల తరఫున నియోజకవర్గ అభివృద్ధికి రూ.1,000 కోట్ల నిధులు వెంటనే కేటాయించాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో నిధులు కేటాయించకపోతే కాంగ్రెస్ నాయకులు ప్రతి గ్రామంలో ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు.
చివరగా, నవంబర్ 29న నిర్వహించే దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో పాటు, ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు పట్టణ, మండల శాఖ అధ్యక్షులు, వివిధ మండలాధ్యక్షులు సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
##లోకల్ యాడ్స్##
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.. మీ డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ…

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు : శ్రీ కూరపాటి రామచంద్రం గారు, కాంగ్రెస్ పార్టీ చేనేత సెల్ రాష్ట్ర కార్యదర్శి, హుజురాబాద్ (రాంపూర్).
