Social 1080×1350 • Multi-page
03-06-2024 BREAKING NEWS 08:23 AM
swarnodayam.com
Telugu Daily News

నేడు, రేపు రాష్ట్రంలో మోస్తారు వర్షం..

నేడు, రేపు రాష్ట్రంలో మోస్తారు వర్షం..
IMG-20240602-WA0256-1

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్‌: రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, ఈ నెల 6వతేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వానలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ మేరకు ‘పసుపు’ రంగు హెచ్చరికలు జారీ చేసింది. ‘సోమవారం ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాలతోపాటు హైదరాబాద్, మహబూబాబాద్‌ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో ఈదురు గాలులతో జల్లులు కురుస్తాయి. మంగళవారం ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, హైదరాబాద్‌ జిల్లాల్లో భారీ, ఇతర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని’ వాతావరణ శాఖ తెలిపింది. 

రాష్ట్ర సరిహద్దులకు నైరుతి 

నైరుతి రుతుపవనాలు ఏపీలోని కర్నూలు జిల్లా వరకు విస్తరించాయని, ఒకట్రెండు రోజుల్లో తెలంగాణలోకి ప్రవేశిస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది. నైరుతి పవనాల ప్రభావంతో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నైరుతి బంగాళాఖాతంతోపాటు కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు తీరాలకు సమీపంలో కొనసాగుతోందని, ఈ ప్రభావంతోనూ తెలంగాణలో వర్షాలు పడతాయని పేర్కొంది. మరోవైపు రాష్ట్రంలో ఆదివారం అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. అత్యధికంగా సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కట్కూరులో 7.6 సెంటీమీటర్లు, హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండలో 7.4, ఇదే జిల్లా ఐనవోలు మండలంలో 6.3, కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలంలో 6.2, రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలంలో 5.8, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా లింగాపూర్‌ మండలంలో 5.6, వరంగల్‌ జిల్లా సంగెం మండలంలో 4.9, వికారాబాద్‌ జిల్లా బంట్వారం మండలంలో 4.2, పెద్దపల్లి జిల్లా కేంద్రంలో 3.8, ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో 3.5 సెం.మీ. వర్షపాతం నమోదయింది. వీటితోపాటు పలు జిల్లాల్లో 1-3.5 సెం.మీ. మధ్య వర్షం పడింది…

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!