Social 1080×1350 • Multi-page
09-06-2024 BREAKING NEWS 11:01 AM
swarnodayam.com
Telugu Daily News

ప్రశాంతంగా గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష.. జిల్లా కలెక్టర్

ప్రశాంతంగా గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష.. జిల్లా కలెక్టర్
IMG-20240609-WA0205

-జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లు..
. మొత్తం 18663 మందికి 14577 మంది అభ్యర్థులు హాజరు
. 4086 మంది గైర్హాజర్
. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్
స్వర్ణోదయం ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో ఆదివారం గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టడం జరిగిందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు. ఆదివారం కరీంనగర్ జిల్లా రామకృష్ణ కాలనీలోని వాగేశ్వరి, జ్యోతిష్మతి, తిమ్మాపూర్ లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలల్లో, కరీంనగర్లోని వాణినికేతన్ డిగ్రీ, పీజీ కళాశాల, పారమిత స్కూల్లలో జరిగిన గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షా కేంద్రాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ పరిశీలించారు. ఈ సందర్భంగా పరీక్షకు సంబంధించిన వివరాలు, సౌకర్యాల కల్పనపై అధికారులను నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. అధికారులంతా టీజీపీఎస్సీ రూపొందించిన నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. అభ్యర్థుల ఫోటో వెరిఫికేషన్ సరిగా చేయాలని, హాల్ టికెట్ పై ఫోటోలు సరిగా లేని వారి నుంచి మూడు పాస్ ఫోటోలు తీసుకోవాలని తెలిపారు. 10 గంటల తరువాత గేట్లు మూసివేయాలని, ఆలస్యంగా వచ్చిన వారిని ఎట్టి పరిస్థితిలో అనుమతించ వద్దని సూచించారు. ఎగ్జామ్ హాల్ కు నిర్ణయించిన సమయంలోగా ఓఎంఆర్, ప్రశ్నపత్రాలను పంపించాలన్నారు. దివ్యాంగుల కోసం పరీక్ష కేంద్రాల్లో ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేశామని, స్క్రైబ్ ల సహాయం కోరే వారికి సహకరించాలని వారికి అదనపు సమయం కేటాయించాలని పేర్కొన్నారు. పరీక్ష పారదర్శకంగా జరిగేందుకు నిరంతరం పర్యవేక్షించేందుకు పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని చెప్పారు. కరీంనగర్ జిల్లాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా సజావుగా సాగిందని పేర్కొన్నారు. బయోమెట్రిక్, సెంటర్ల వారీగా కేటాయించిన సిబ్బంది హాజరు, తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో సజావుగా పరీక్షలు జరిగేలా 36 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, 36 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, 36 మంది అబ్జర్వర్లు, ఏడుగురు రూట్ ఆఫీసర్లు, ఏడుగురు ఫ్లైయింగ్ స్క్వాడ్స్, 208 ఐడెంటిఫికేషన్ అధికారులను నియమించినట్లు వెల్లడించారు.
18663 మంది గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారని, వీరిలో 14577 మంది హాజరు కాగా 4086 మంది గైర్హాజరైనట్లుగా పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద తగిన పోలీస్ భద్రతను కల్పించడంతో పాటు అధికారులు, పోలీస్ సిబ్బందితో స్ట్రాంగ్ రూమ్ నుండి ఎగ్జామ్ సెంటర్ లకు మెటీరియల్ తరలించామని తెలిపారు. పరీక్ష ప్రశాంతంగా సాగేలా సహకరించిన అధికారులు, సిబ్బంది, పోలీసు అధికారులకు అదనపు కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!