Social 1080×1350 • Multi-page
16-08-2024 BREAKING NEWS 10:41 PM
swarnodayam.com
Telugu Daily News

తెగ తాగేస్తున్నారు… రెండవ స్థానంలో తెలంగాణ….!!

తెగ తాగేస్తున్నారు… రెండవ స్థానంలో తెలంగాణ….!!
IMG-20240617-WA0112

-మద్యం మత్తులో అరుణాచల్‌ ప్రదేశ్‌ ఫస్ట్‌

-ఆ రాష్ట్రంలో 52.6 శాతం మంది మందుబాబులు

-తర్వాతి స్థానంలో తెలంగాణ

-ఇక్కడ 43.4 శాతం మద్యం ప్రియులు

-అతి తక్కువ తాగుబోతుల రాష్ట్రంగా లక్షద్వీప్‌

-జాతీయ కుటుంబ సర్వేలో వెల్లడి

-రోడ్డుపాలవుతున్న నిరుపేద కుటుంబాలు

-లాభర్జనే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

-పట్టించుకోని ఎక్సైజ్‌ శాఖ అధికారులు

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: దేశంలోని ఆయా రాష్ట్రాలు మద్యం మత్తులో తూగుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోనే మద్యం సేవించే వారి సంఖ్య గణనీయంగా ఉంది. దీంతో పొట్టకూటి కోసం కూలీనాలి చేసుకుని జీవించే కుటుంబాల పరిస్థితి దారుణంగా తయారైంది. ఈ వ్యసనానికి బానిస కావడంతో మందుబాబుల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో రోడ్డున పడుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాభార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తుండగా పట్టించుకోవాల్సిన ఎక్సైజ్‌ శాఖ చూసీ చూడనట్టు వ్యవహరిస్తోంది. దీంతో వారి చావులు, ఆత్మహత్యలతో మరణ మృదంగం మోగుతోంది. భారతదేశంలో జాతీయ కుటుంబ సంక్షేమంపై కేంద్ర కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సర్వే చేయించింది. జాతీయ కుటుంబ సంక్షేమ సర్వే ప్రతి మూడేండ్లకోసారి నిర్వహిస్తారు. మార్చి 2022లో ప్రచురితమైన ఈ అధ్యయనం 2019 నుంచి 2021 వరకు మూడేండ్ల డేటాను తెలియజేస్తున్నది. ఈ సర్వేలో మద్యం వినియోగానికి సంబంధించి ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. మద్యం వినియోగంలో నగరాలకు, పట్టణాలకు మధ్య.. పురుషులకు, స్త్రీలకు మధ్య ఉన్న వ్యత్యాసాలను ఈ సర్వే వెల్లడించింది. దేశంలో నగరాల్లో కంటే గ్రామాల్లోనే ఎక్కువగా మద్యం సేవిస్తున్నారని స్పష్టం చేసింది.ఈ సర్వే ప్రకారం…దేశంలో అత్యధికంగా పురుషులు మద్యం సేవిస్తున్న రాష్ట్రంగా అరుణాచల్‌ ప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో 52.6 శాతం మంది మందుబాబులు మద్యం సేవిస్తున్నారు. తర్వాతి స్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలిచింది. ఇక్కడ 43.4 శాతం మంది మద్యం సేవిస్తున్నారు. మూడో స్థానంలో సిక్కిం (39.9 శాతం), అండమాన్‌ (38.8 శాతం) ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా మణిపూర్‌ (37.2 శాతం), గోవా (36.8 శాతం), ఛత్తీస్‌గఢ్‌ (34.7 శాతం) నిలిచాయి.
అతి తక్కువ తాగుబోతుల రాష్ట్రంగా లక్షద్వీప్‌
అలాగే అతి తక్కువ మద్యం సేవించే రాష్ట్రాల జాబితాలో లక్షదీప్‌ అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ 0.4 శాతం మంది పురుషులు మాత్రమే మద్యం సేవిస్తున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో గుజరాత్‌ (5.8 శాతం), జమ్మూ కశ్మీర్‌ (8.7 శాతం), రాజస్థాన్‌ (11 శాతం), మహారాష్ట్ర (13.9 శాతం), ఉత్తరప్రదేశ్‌ (14.5 శాతం) ఉన్నాయి.ఇక మహిళల పరంగా చూస్తే.. అత్యధికంగా అరుణాచల్‌ ప్రదేశ్‌లో 24.2 శాతం మంది మహిళలు మద్యం సేవిస్తున్నారు. తర్వాత స్థానాల్లో సిక్కిం (16.2 శాతం), అస్సాం (7.3 శాతం), తెలంగాణ (6.7 శాతం), జార్ఖండ్‌ (5.7 శాతం), అండమాన్‌ (5 శాతం), ఛత్తీస్‌గఢ్‌ (4.9 శాతం) ఉన్నాయి. దేశంలోని ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరాఖండ్‌, మణిపూర్‌, మేఘాల య, త్రిపుర, ఒడిశాలలో మద్యం సేవించే వారి సంఖ్య ఎక్కువగా ఉంది.
నాలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న మద్యపాన నిషేధం
ప్రస్తుతం బీహార్‌, గుజరాత్‌, మిజోరాం, నాగాలాండ్‌ రాష్ట్రాల్లో మద్యపాన నిషేధం అమలులో ఉంది. మరికొన్ని రాష్ట్రాల్లో కూడా మద్యం విక్రయాలు జరుగుతున్నప్పటికీ మద్యానికి స్వస్తి పలకాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!