
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, సెప్టెంబర్ 11: హుజురాబాద్ పట్టణంలోని అల్ఫోర్స్ జీనియస్ పాఠశాలలో శుక్రవారం ముందస్తు వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు స్వయంగా మట్టి వినాయక విగ్రహాలను తయారు చేసి ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డా. వి. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. వినాయక చవితి కులమతాలకు అతీతంగా ప్రజలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చే పండుగ అని అన్నారు. అందరూ కలిసికట్టుగా మండపాలను ఏర్పాటు చేసి స్వామివారిని పూజించడం ద్వారా సమాజంలో ఐక్యత, సోదరభావం మరింత పెంపొందుతాయని తెలిపారు.

పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం
మట్టి విగ్రహాలను పూజించడం ద్వారా ప్రకృతి, పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెరుగుతుందని డా. నరేందర్ రెడ్డి అన్నారు. రసాయన రంగులు లేని సహజసిద్ధమైన మట్టి వినాయక విగ్రహాలను పూజకు ఉపయోగించడం శ్రేయస్కరమని సూచించారు. పర్యావరణానికి హాని కలిగించని విధంగా వినాయక చవితి వేడుకలను నిర్వహించాలని కోరారు.
విఘ్నేశ్వరుడు విఘ్నాలన్నీ తొలగించి ప్రతి ఒక్కరి ఇంటా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులు ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.


ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
విద్యార్థులు తయారు చేసిన మట్టి వినాయక విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం విద్యార్థులు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.





