
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, జనవరి23: మరణం లేని మహావీరుడు, భరత మాత ముద్దుబిడ్డ నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్ఫూర్తిగా దేశంకోసం యువత తెగించి పోరాడాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నగర కార్యదర్శి జన్ను తేజ పిలుపునిచ్చారు. నేతాజి 128వ జయంతిని పురస్కరించుకొని గురువారం ఏబీవీపీ హుజురాబాద్ శాఖ ఆధ్వర్యంలో పరాక్రమ దివస్ ఉత్సవాలలో భాగంగా నేతాజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళిలు ఆర్పించారు. అనంతరం నగర కార్యదర్శి జన్ను తేజ మాట్లాడుతూ భారత స్వాత్రంత్య్ర ఉద్యమంలో బ్రిటీష్ పాలకుల గుండెల్లో సింహం వలే నిద్రించారని తెలిపారు. నాకు రక్తాన్నివ్వండి, మీకు దేశాన్నిస్తాను అంటూ యువతలో స్వతంత్ర్య కాంక్షను రగిలించిన స్ఫూర్తిప్రధాతగా అభివర్ణించారు. జైహింద్ నినాదంతో నరనరాన దేశభక్తిని నింపి, అజాద్ హింద్ ఫౌజును స్థాపించిన నేతాజీ చరిత్రను ప్రతీ ఒక్కరు. తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నగర హాస్టల్స్ కన్వీనర్ పెరుగు అభిలాష్, నగర సంయుక్త కార్యదర్శి విజయ్, నగర ఉపాధ్యక్షులు భరత్, యశ్వంత్, శివ తదితరులు పాల్గొన్నారు.







