
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: తెలుగు ప్రజలను ఎంతగానో ఆకర్షిస్తున్న ఈటీవీ ప్రసారం చేసే కామెడీ షో ‘జబర్దస్త్’ వేదికపై హుజురాబాద్ కళాకారులు శనివారం రాత్రి సందడి చేశారు. బుల్లితెరపై హుజురాబాద్ యూట్యూబర్స్ ఒక్కసారిగా మెరవడంతో కళలకు కాణాచి, అద్భుత ప్రతిభకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న మన హుజూరాబాద్ గడ్డ మరోమారు బుల్లితెరపై తన సత్తా చాటుకుంది. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన వినోద కార్యక్రమం ‘జబర్దస్త్’ వేదికపై మన ప్రాంతానికి చెందిన యువ కళాకారులు ‘కరీంనగర్ టీం’ పేరుతో నవ్వుల జల్లులు కురిపిస్తున్నారు. సామాన్య కుటుంబాల నుంచి వచ్చి, తమలోని అద్భుతమైన హాస్య చతురతతో జాతీయ స్థాయి వేదికపై రాణిస్తుండటం పట్ల నియోజకవర్గ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల హుజురాబాద్‌కు చేరుకున్న ఈ టీం సభ్యులను బాచి ప్రాంక్ ఫేమ్, ప్రముఖ సామాజిక కార్యకర్త సమ్మెట సాయిరాం మర్యాదపూర్వకంగా కలిసి వారికి స్వీట్లు తినిపించి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సాయిరాం మాట్లాడుతూ.. హుజూరాబాద్ యువకులు స్వయంకృషితో పైకి వచ్చి, జబర్దస్త్ వంటి ప్రతిష్టాత్మక షోలో టీం లీడర్లుగా ఎదగడం హుజురాబాద్ ప్రాంతానికే కాక జిల్లాకే గర్వకారణమని కొనియాడారు. వారి కృషికి స్థానిక ప్రజల ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు.
నవ్వుల నావలో మన వారు..
ఈ బృందంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారంతా మన ప్రాంత వాసులే కావడం విశేషం. హుజురాబాద్‌కు చెందిన ఆర్ఎంపి వైద్యుడు, యూట్యూబర్ కమల్ సింగ్ టీం లీడర్‌గా వ్యవహరిస్తూ జబర్దస్త్ జట్టును సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్నారు. అలాగే సిరిసపల్లికి చెందిన చొప్పరి అనిల్, హుజురాబాద్‌కు చెందిన పుదరి ప్రసాద్ తమ విలక్షణమైన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ జిల్లా పేరును రాష్ట్రవ్యాప్తంగా మారుమోగిస్తున్నారు.
ప్రతి శుక్రవారం, శనివారం రాత్రి 9:30 గంటలకు ఈటీవీ (ETV) ఛానల్లో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమంలో మన ‘కరీంనగర్ టీం’ ప్రత్యేక ప్రదర్శనలు ఇవ్వనుంది. మన ప్రాంత కళాకారులను ప్రతి ఒక్కరూ ఆదరించాలని, వారిని మరింత ప్రోత్సహించాలని పట్టణ వాసులు కోరుతున్నారు. వీరు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి వెండితెరపై కూడా వెలిగిపోవాలని ప్రతి ఒక్కరు ఆకాంక్షిస్తున్నారు.

జబర్దస్త్ లో మెరిసిన కమల్ సింగ్, ఆయన టీం సభ్యులకు పుష్పగుచ్చాలు ఇచ్చి శాలువా కప్పి సత్కరిస్తున్న సాయిరాం..







