
—ఘనంగా రజతోత్సవ వేడుకలు
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : రైతుల ప్రయోజనాల కోసం ఏర్పడ్డ ధర్మరాజుపల్లి ధాన్య విత్తన రైతు పరస్పర సహాయ సహకార పరపతి సంఘం దేశానికి ఆదర్శంగా నిలిచి, సహకార ఉద్యమానికి ఊపిరి పోసిందని కేడిసిసి మాజీ అధ్యక్షులు కొండూరి రవీందర్ రావు పేర్కొన్నారు.

గురువారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం ధర్మరాజుపల్లి గ్రామంలో ధర్మరాజుపల్లి దాన్య విత్తన రైతు పరస్పర సహాయ సహకార పరపతి సంఘం రజతోత్సవ వేడుకల మహాసభ జరిగింది. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ… 1999లో 150 మంది రైతులతో ఏర్పడ్డ ఈ సంఘం దినదినం అభివృద్ధి చెందుతూ 25 సంవత్సరాలలో రాష్ట్రంతో పాటు దేశంలోనే ఉత్తమ రైతు సహకార సంఘంగా ఏర్పడిందన్నారు. వరంగల్ సహా వికాస సంస్థ ప్రోత్సాహంతో ముల్కనూరు గ్రామీణ బ్యాంకు సూచనల మేరకు ఈ సంఘం తన కార్యకలాపాలను కొనసాగిస్తూ రైతుల ప్రయోజనాల కోసమే పాటు పడుతుందన్నారు. రైతులే యజమానులుగా సభ్యులుగా ఏర్పడ్డ ఈ సంఘం ప్రస్తుతం మూడు గోదాములు నిర్మించి రైతుల వద్ద విత్తనాలను కొనుగోలు చేస్తున్నారన్నారు. డీలర్ల ద్వారా కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, విజయనగరం, అనంతపూర్ తో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, హర్యానా ప్రాంతాలకు విత్తనాలను పంపిస్తుందన్నారు. ఒక గ్రామంలో రైతుల ప్రయోజనాల కోసం ఏర్పడ్డ సంస్థ 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం గొప్ప విషయం అని, దీని వెనుక ప్రతి ఒక్క రైతు కృషి దాగి ఉందని అభినందించారు.


ఈ సందర్భంగా 25 సంవత్సరాల లోగో, విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ముల్కనూరు కో-ఆపరేటివ్ సంఘ అధ్యక్షులు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, జిల్లా సహకార అధికారి ఎస్ రామానుజాచార్య, ఏడిఏ సునీత, కేడిసిసి ఉపాధ్యక్షులు పింగిలి రమేష్, జనరల్ మేనేజర్ విఎస్ రాజు, సీడ్ మిల్లర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పుల్లూరి ప్రభాకర్ రావు, సంఘము అధ్యక్షులు బొనగాని శ్రీనివాస్ గౌడ్, స్థానిక సెంటర్ మేనేజర్ మూగల రమణారెడ్డి, సహా వికాస అధ్యక్షురాలు కాసర్ల జయప్రద, ఏవో భూమిరెడ్డి, సింగిల్ విండో అధ్యక్షులు ఎడవల్లి కొండల్ రెడ్డి, శ్యాంసుందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, అనిల్, తిరుపతి, లక్ష్మారెడ్డి, ఓదేలు తదితరులు పాల్గొన్నారు.

అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డితో గ్రామ మహిళా రైతులు





