
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ముందు రైతులతో చేసుకున్న ఒప్పందం ప్రకారం కాకుండా తక్కువ ధర చెల్లిస్తూ రైతులను సీడ్ మిల్లులు నిలువునా ముంచుతున్నాయని రైతు సంఘం నాయకులు వంగల వేమారెడ్డి, రావుల రమణారెడ్డి, ఎడ్ల విజయ్ కుమార్ లు ఆరోపించారు. గురువారం వారు హుజురాబాద్ లోనీ ఏడీఏ కార్యాలయం ముందు సీడు వ్యాపారులు రైతులకు ముందుగా రాసి ఇచ్చిన ఒప్పంద పత్రాలను పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. కరీంనగర్ జిల్లా సీడ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ వారు రైతులకు క్వింటాకు 2550 రూపాయలు ఇస్తామని చెప్పి పంట చేతికి వచ్చిన తర్వాత ప్రస్తుతం 2500 రూపాయలు మాత్రమే ఇస్తామని ప్రకటించడం రైతులను వంచించడమేనని అన్నారు. హుజురాబాద్ మండలంలో వందలాది మంది రైతులు వేలాది ఎకరాల్లో సీడ్ పంటలు వేశారని వీరికి సీడ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ నిర్ణయం వల్ల నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. ముందు ఒక మాట తరువాత ఒక మాట చెపుతున్న జిల్లా సీడ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ పై వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు నష్టపోకుండా వ్యవసాయ శాఖ అధికారులు ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం డబ్బులు కట్టించేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఒక్కో మండలంలో కోటికి పైగా రైతులు నష్టపోవాల్సి వస్తుందని జిల్లావ్యాప్తంగా పెద్ద మొత్తంలో సీడు వ్యాపారులు కోట్ల రూపాయలు దోచుకోవడం జరుగుతుందని, ఈ సీడ్ వ్యాపారుల దోపిడీని అరికట్టి రైతులకు తగిన న్యాయం చేయాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.





