
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో ఇండ్ల నిర్మాణాలు చేసుకుంటున్న పేద ప్రజలకు ప్రభుత్వ విధానాల వల్ల ఇసుక దొరకడం లేదని, అధిక ధరలకు కొనుగోలు చేయడం ద్వారా వారిపై భారం పడుతుందని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం హుజూరాబాద్ మండల సర్వసభ్య సమావేశం హుజురాబాద్ ఆర్డీవో జల కుమారి అధ్యక్షతన జరిగింది.

ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ…నియోజకవర్గంలోని వీణవంకలో ఇసుక రీచ్ లు ఉన్నప్పటికీ పేదలకు ప్రభుత్వ ధరకు అందడం లేదని, యాప్ తొందరగానే బందు అవడంతో రెండు వేలకు దొరికే ఇసుక ఎనిమిది వేలతో కొనుగోలు చేసి పేద ప్రజలు అధిక భారాన్ని మోస్తున్నారని అన్నారు. ఒకవైపు అధికారులు ఇండ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని వారిని ఒత్తిడి చేయడం, మరోవైపు ఇసుక దొరకక అధిక ధరలకు తప్పనిసరి పరిస్థితుల్లో కొనుగోలు చేయడంతో ఇండ్ల నిర్మాణ ఖర్చు పెరుగుతుందని దీనివల్ల పేద ప్రజలు అప్పుల పాలవుతున్నారని అన్నారు. చాలా నిర్మాణాలు ఇసుక దొరకక ఆగిపోయిన వి కూడా ఉన్నాయన్నారు. హుజురాబాద్ ఆర్డిఓ ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌కు తెలియజేసి పలు ప్రాంతాల్లో చెక్‌పోస్టుల ఏర్పాటు చేయాలని సూచించారు. మండలంలోని వివిధ శాఖల అధికారులు ప్రజలకు ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందే విధంగా సమన్వయంతో పని చేయాలన్నారు. ప్రజలకు 24 గంటల కరెంటు గత ప్రభుత్వం ఇవ్వగా ఈ ప్రభుత్వం రైతులకు 12 గంటలు మాత్రమే ఇవ్వడం తో రైతులు అవస్థలు పడుతున్నారని అన్నారు. డొమెస్టిక్ కరెంటు కూడా సక్రమంగా ఇవ్వక ప్రజలను ఇబ్బందుల పాలు చేయడం తగదని అధికారులను సూచించారు. గత ప్రభుత్వ కాలంలో ఎన్నడూ ట్రిప్పు కానీ కరెంటు ఇప్పుడు ఎందుకు సక్రమంగా రావడం లేదని ఆయన ప్రశ్నించారు. ఎల్ నినో ప్రభావం వల్ల ప్రజలకు తాగు సాగునీటికి ఇబ్బంది అవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం కన్నెపల్లి పంపు హౌస్ నుండి నీటిని మోటార్ల ద్వారా ఎత్తిపోయకుండా చోద్యం చూస్తుందన్నారు. ప్రజల తాగు నీటి అవసరాలు తీర్చడానికి వెంటనే తమ విధానాలు మార్చుకోవాలన్నారు.





హుజురాబాద్ మండలంలో లోటు వర్షపాతం ఉండడంవల్ల వరి సాగు తక్కువగా అయిందని రైతులకు కావలసిన యూరియా బస్తాలు, డిఏపి అందుబాటులో ఉండే విధంగా వ్యవసాయ అధికారులు ముందస్తు ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలన్నారు. గ్రామాల్లో చేయూత పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న అందరివి పరిశీలించాలని కేవలం 70 ఏళ్లు ఉన్నవారికి పింఛన్ ఇస్తామనడం బాధాకరమని అన్నారు వితంతువులకు కూడా 40 ఏళ్ల పరిధి పెట్టడం కూడా సరైనది కాదన్నారు. మండలంలో అన్ని గ్రామాల్లో మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సౌకర్యం సక్రమంగా అందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. చెల్పూర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సక్రమంగా విద్యను అందించే విధంగా టీచర్లు ఉండేలా విద్యాశాఖ అధికారులు చూడాలన్నారు. ప్రభుత్వ అధికారులు బాధ్యతగా ప్రజలకు సేవలను అందించాలని ఎలాంటి ఇబ్బందులు ఉన్న తన దృష్టికి తీసుకొని రావాలని అన్నారు. అధికారుల పనితీరు వల్లనే మండలంలో అభివృద్ధి జరుగుతుందని వారందరూ బాధ్యతగా పనిచేయాలని కోరారు. ఆర్డిఓ జల కుమారి మాట్లాడుతూ….మండలంలోని వివిధ సమస్యలను జిల్లా అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. తమ గ్రామంలో ఉన్న సమస్యలను సర్పంచులు వంతడుపుల కస్తూరి, పోల్సాని రామారావు, ప్రవీణ్ కుమార్, కట్కూరి మల్లారెడ్డి, మాధవి, సంధ్యారాణి, కత్తుల రాజు, ఇమ్మడి దయాకర్, చిరంజీవి, పెరుమాండ్ల హైమ, తదితరులు అధికారులకు వివరించారు. తమ గ్రామ సమస్యలు పరిష్కారం చేయాలని, ప్రజలకు తాము జవాబుదారి కావడం వల్ల తమను వారు ప్రశ్నిస్తారని అన్నారు. వారి ప్రశ్నలకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పందించి అధికారులతో జవాబులు చెప్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తూర్పాటి సునీత, తాసిల్దార్ జక్కని నరేందర్, ఏవో భూమిరెడ్డి, లతా మంగేస్వర్, నరేష్, రమేష్, సంతోష్, బాలరాజు, పలువురు అధికారులు పాల్గొన్నారు
**లోకల్ యాడ్స్**
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: న్యూ శాతవాహన హై స్కూల్, సూపర్ బజార్ రోడ్(ఇందిరా మార్గ్) హుజూరాబాద్, కరీంనగర్ జిల్లా.





