
– హుజూరాబాద్‌లో 4వ రోజుకు చేరిన జర్నలిస్టుల రిలే నిరాహార దీక్షలు
– దీక్షా శిబిరానికి టీజేఎస్ రాష్ట్ర నేత, న్యాయవాది ముక్కేర రాజు సంపూర్ణ మద్దతు..
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: నిత్యం ప్రజల సమస్యలపై గళమెత్తే జర్నలిస్టులు తమ న్యాయమైన హక్కుల కోసం నేడు రోడ్డెక్కి నిరసన తెలపాల్సి రావడం అత్యంత బాధాకరమని తెలంగాణ జన సమితి (టీజేఎస్) రాష్ట్ర నాయకులు, ప్రముఖ న్యాయవాది ముక్కేర రాజు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఉద్యమ ఆకాంక్షను ప్రజల్లోకి తీసుకెళ్లిన చరిత్ర జర్నలిస్టులదని, అలాంటి వారి సంక్షేమం పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు.
హుజూరాబాద్ పట్టణంలో జర్నలిస్టుల నివేశన స్థలాలపై కాంగ్రెస్ నాయకుడు గూడూరు స్వామిరెడ్డి కోర్టులో కేసు వేయడాన్ని నిరసిస్తూ హుజూరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం నాల్గవ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపిన ముక్కేర రాజు మాట్లాడుతూ పలు కీలక అంశాలను ప్రస్తావించారు.

ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలి…
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వస్తే అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు, పక్కా ఇళ్లు నిర్మిస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
వివిధ కుల సంఘాలకు స్థలాలు కేటాయించినప్పుడు లేని అభ్యంతరాలు, సమాజం కోసం నిరంతరం శ్రమించే జర్నలిస్టుల విషయంలోనే ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు.
జర్నలిస్టుల స్థలాలపై కోర్టులో ఉన్న కేసుల విషయంలో రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్యం వీడి, పటిష్టమైన కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసి ఆ కేసులు త్వరగా వీగిపోయేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల మంజూరు…
ఇప్పటికే అన్ని అనుమతులు, ఇంటి నంబర్లు, విద్యుత్ కనెక్షన్లు పొంది తాత్కాలిక ఇల్లు నిర్మించుకున్న జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి ఆదుకోవాలన్నారు.
జర్నలిస్టుల సమస్య పూర్తిగా పరిష్కారమయ్యే వరకు తమ పార్టీ, తాము అండగా ఉంటామని, అవసరమైతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వాసుదేవ రెడ్డి, జర్నలిస్టులు, జేఏసీ నాయకులు వేల్పుల రత్నం, బీసీ జేఏసీ నాయకులు చందుపట్ల జనార్ధన్, ముదిరాజ్ సంఘం నాయకులు కొలిపాక సమ్మయ్య, ప్రొఫెసర్ శేఖర్, పాల్గొన్నారు.







