Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: స్థానిక కౌన్సిలర్ వేధింపులు భరించలేక ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన హుజూరాబాద్ పట్టణంలో తీవ్ర కలకలం రేపింది. ప్రస్తుతం బాధితుడు ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హుజూరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డుకు చెందిన గోస్కుల సత్యనారాయణ నూతనంగా ఇంటి నిర్మాణాన్ని చేపట్టారు. అయితే, అదే వార్డు కౌన్సిలర్ గోస్కుల రాజకుమార్ గత నాలుగు నెలలుగా భవన నిర్మాణాన్ని అడ్డుకుంటూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. పనులు జరుగుతున్న సమయంలో మున్సిపల్ సిబ్బందిని పంపించి సామగ్రిని సీజ్ చేయించడం, పనులను నిలిపి వేయించడం వంటి చర్యలతో వేధింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం.
కౌన్సిలర్ వేధింపులు మితిమీరి పోవడంతో తీవ్ర మానసిక వేదనకు గురైన సత్యనారాయణ.. గతంలో మున్సిపల్ చైర్ పర్సన్ రొంటాల సుహాసిని, మున్సిపల్ కమిషనర్ కిషన్ తోపాటు, పలుమార్లు స్థానికుల వద్ద తన గోడును వెళ్లబోసుకున్నారు. ఈ వేధింపులు ఇలాగే కొనసాగితే తాను ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో మార్గం లేదని ఆవేదన వ్యక్తం చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన సత్యనారాయణ శనివారం సాయంత్రం స్థానిక బతుకమ్మ సౌడ్ల వద్దకు చేరుకుని పురుగుల మందు తాగారు. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి హుటాహుటిన హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం, పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం బంధువులు జమ్మికుంట లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ విషయమై కౌన్సిలర్ రాజ్ కుమార్ ను, మున్సిపల్ సిబ్బంది వ్యవహరించిన తీరుపై కమిషనర్ ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా వారు అందుబాటులోకి రాలేదు.

ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న గోస్కుల సత్యనారాయణ..





