Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్ : భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే నేటి తరానికి అసలైన యుద్ధమని, బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన ఓటు హక్కుతోనే బహుజనుల విముక్తి సాధ్యమని తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ డాక్టర్ వెన్నెల పిలుపునిచ్చారు. ప్రజా యుద్ధ నౌక గద్దర్ మూడో వర్ధంతిని పురస్కరించుకుని హుజురాబాద్లో శనిగరపు బాబ్జీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంస్మరణ సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.



పోరాటాలకు గద్దర్ జీవితమే స్ఫూర్తి :
తెలంగాణ ఉద్యమంలో “బండెనక బండి గట్టి”, “పొడుస్తున్న పొద్దు మీద” పాటలతో యావత్ రాష్ట్రాన్ని కదిలించిన గద్దరన్న ఆశయాలు చిరస్మరణీయమని డాక్టర్ వెన్నెల పేర్కొన్నారు. గద్దరన్న తన చివరి శ్వాస వరకు పీడిత వర్గాల తరఫున నిలబడ్డారని, రానున్న తరాలకు భారత రాజ్యాంగాన్ని పరిరక్షించే మహత్తర బాధ్యతను ఒక ఆయుధంగా ఇచ్చి వెళ్లారని గుర్తుచేశారు. ఈ క్రమంలో గద్దర్ జీవితాన్ని నిలబెట్టడంలో తన తల్లి విమలమ్మ చేసిన ప్రాణ త్యాగాన్ని, పోరాట పటిమను ఆమె సభలో భావోద్వేగంతో ప్రస్తావించారు.
మహిళలకు సముచిత స్థానం దక్కాలి
బాబాసాహెబ్ ఆశించిన మహిళా సమానత్వం ఇంకా సంపూర్ణంగా నెరవేరలేదని, వేదికలపైనా, చట్టసభల్లోనూ మహిళలకు ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు. స్థానిక సంస్థలు మొదలుకుని అసెంబ్లీ, పార్లమెంటు వరకు సామాన్య మహిళలు, చదువుకున్న యువత, ఆటో డ్రైవర్లు నాయకులుగా ఎదిగినప్పుడే నిజమైన ప్రజాస్వామ్య సమానత్వం సాధ్యమవుతుందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలైన అసెంబ్లీ, స్పీకర్ స్థానాల గౌరవాన్ని కించపరిచేలా వ్యవహరించే తీరును ప్రజలు ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
సభ ముగింపులో గద్దర్ చివరిగా రచించిన “నా బానిసలారా లెండిరా… అడుక్కతింటే మన ఆకలి తీరదు…” గీతాన్ని ఆమె స్వయంగా ఆలపించి సభికుల్లో ఉత్తేజాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం చైర్ పర్సన్ రోంటాల సుహాసిని, ప్రొఫెసర్ ఖాసిం, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, ప్రజా సంఘాల నాయకులు, ఉద్యమకారులు, కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





