
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్ (ఆగస్టు 25):
హుజూరాబాద్ పట్టణంలోని 4వ వార్డులో వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. స్థానిక కౌన్సిలర్ ప్రతాప తార-తిరుమల్ రెడ్డిల ఆధ్వర్యంలో వార్డు ప్రజలకు పర్యావరణ హితమైన మట్టి విగ్రహాలను ఉచితంగా అందజేశారు.

ఈ సందర్భంగా కౌన్సిలర్ దంపతులు మాట్లాడుతూ… ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (PoP) విగ్రహాల వల్ల కలిగే కాలుష్యాన్ని నివారించేందుకు, ప్రజల్లో పర్యావరణ స్పృహ పెంచేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. మట్టి విగ్రహాలు నీటిలో త్వరగా కరిగిపోయి పర్యావరణానికి ఎలాంటి హాని చేయవని, ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులనే పూజించాలని కోరారు.

ఈ పంపిణీ కార్యక్రమానికి స్థానికులు, మహిళలు పెద్ద ఎత్తున హాజరై మట్టి వినాయక విగ్రహాలను ఉత్సాహంగా తీసుకువెళ్లారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తూ ఉచితంగా విగ్రహాలు పంపిణీ చేసిన కౌన్సిలర్ ప్రతాప తార-తిరుమల్ రెడ్డిలను 3వ వార్డ్ కౌన్సిలర్ గందే శ్రీనివాస్, ఏ శ్రీనివాస్, స్థానిక ప్రజలు, పలువురు ప్రముఖులు అభినందించారు.





