
—అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలి..
గత ఇబ్బందులు పునరావృతం కాకుండా పకడ్బందీ ఏర్పాట్లు
—పక్కా ప్రణాళికతో ముందుకు..
—అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలి..
—నిమజ్జనోత్సవాన్ని ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా బాధ్యతాయుతంగా పనిచేయాలి..
ప్రజలు శభాష్ అనేలా విధులు నిర్వర్తించాలి.
—కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్
మానకొండూరు, చింతకుంట, కొత్తపల్లిలో వినాయక నిమజ్జనానికి సంబంధించి ఏర్పాట్ల పరిశీలన..
ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని అధికారులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ దిశానిర్దేశం
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, కరీంనగర్ : కరీంనగర్లో ఈ నెల 23న నిర్వహించనున్న వినాయక నిమజ్జనోత్సవాన్ని బ్రహ్మాండంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. గతంలో నిమజ్జన సమయంలో ఎదురైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈసారి ముందస్తు ప్రణాళికతో పకడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, విద్యుత్, లైటింగ్, భారీ క్రేన్లు, పారిశుధ్యం, ట్రాఫిక్ నియంత్రణ తదితర సౌకర్యాలను ముందుగానే సిద్ధం చేయాలని సూచించారు.

బుధవారం రాత్రి మానకొండూరు, కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని చింతకుంట, కొత్తపల్లి ప్రాంతాల్లో వినాయక నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లను కేంద్ర మంత్రి పరిశీలించారు. జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, మేయర్ కొలగాని శ్రీనివాస్ డిప్యూటీ మేయర్ వై. సునీల్ రావు, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రెడ్డి, కరీంనగర్ ఆర్డీవో షర్మిలతో పాటు వివిధ శాఖల అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను సమీక్షించారు.

నిమజ్జన ప్రాంతాలకు అవసరమైన నీరు
కరీంనగర్లోని గణనీయ సంఖ్యలో వినాయక విగ్రహాలు మానకొండూరు చెరువు, చింతకుంట కాకతీయ కెనాల్, కొత్తపల్లి ప్రాంతాల్లో నిమజ్జనం కానున్న నేపథ్యంలో నీటి లభ్యతపై ప్రత్యేక దృష్టి సారించినట్లు బండి సంజయ్ తెలిపారు.

మానకొండూరు చెరువుతో పాటు చింతకుంట కాకతీయ కెనాల్, కొత్తపల్లి ప్రాంతాల్లో నిమజ్జనానికి అవసరమైన నీటిని విడుదల చేయాలని సాగునీటి శాఖ మంత్రి, ఉన్నతాధికారులను కోరినట్లు ఆయన చెప్పారు. నిమజ్జనోత్సవ సమయానికి అవసరమైన నీటిని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని తెలిపారు. ఇరిగేషన్ అధికారులు ఇందుకు
అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు.

—భారీ క్రేన్లు.. జాలర్లు సిద్ధం చేయాలి
నిమజ్జన ప్రాంతాల్లో అవసరమైన సంఖ్యలో భారీ క్రేన్లు, జాలర్లు, సిబ్బందిని అందుబాటులో ఉంచాలని బండి సంజయ్ అధికారులను ఆదేశించారు. విగ్రహాల నిమజ్జనం సురక్షితంగా జరిగేలా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.
కరీంనగర్లోని సుమారు 50 శాతం వినాయక విగ్రహాలు మానకొండూరు చెరువు వద్ద నిమజ్జనం కానున్నందున అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని చెప్పారు.

—భక్తులకు అన్ని సౌకర్యాలు
నిమజ్జనోత్సవానికి వచ్చే భక్తులకు తాగునీటి వసతి కల్పించాలని, నిమజ్జన ప్రాంతాల్లో తగిన లైటింగ్ ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. పరిసరాలను ముందుగానే పరిశుభ్రంగా మార్చి చెత్తాచెదారం, పొదలు, ఇతర వ్యర్థాలు లేకుండా చూడాలని నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. భక్తులు, ప్రజలు రాత్రివేళల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకపోకలు సాగించేలా అవసరమైన వెలుతురు, ఇతర మౌలిక వసతులు కల్పించాలని చెప్పారు.

విద్యుత్ భద్రతపై ప్రత్యేక శ్రద్ధ
—ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు
వినాయక శోభాయాత్రలు, నిమజ్జనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి అన్నారు. ప్రయాణికులు, స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్, ఆర్అండ్బీ అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో ముందుగానే ట్రాఫిక్ నియంత్రణ, మళ్లింపు చర్యలను సిద్ధం చేసుకోవాలని చెప్పారు.

అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి
వినాయక నిమజ్జనోత్సవం విజయవంతంగా నిర్వహించేందుకు పోలీస్, సాగునీటి, విద్యుత్, ఆర్అండ్బీ, మైనింగ్, రెవెన్యూ, నగరపాలక సంస్థ తదితర శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని బండి సంజయ్ ఆదేశించారు. నిమజ్జనానికి ముందే అన్ని ఏర్పాట్లు పూర్తిచేసి చివరి నిమిషంలో ఎలాంటి ఇబ్బందులకు అవకాశం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. భారీ క్రేన్లను ఏర్పాటు చేయాలని సంబంధిత మరమ్మత్తు చేసే ఆపరేటర్లను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. నగరపాలక సంస్థ తరఫున గతంతో పోలిస్తే రెట్టింపు స్థాయిలో నిమజ్జనోత్సవ ఏర్పాట్లకు నిధులు కేటాయించినట్లు ఆయన తెలిపారు.
—గత సమస్యలకు చెక్.. ప్రశాంతంగా నిమజ్జనం
గతంలో నిమజ్జన సమయంలో ఎదురైన సమస్యలను అధిగమిస్తూ ఈసారి మరింత సమర్థవంతంగా ఏర్పాట్లు చేస్తున్నామని బండి సంజయ్ అన్నారు. భక్తుల భద్రత, సౌకర్యాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ నిమజ్జనోత్సవాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తామని తెలిపారు. “గతంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయో వాటిని దృష్టిలో ఉంచుకుని ఈసారి ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. వినాయక నిమజ్జనోత్సవాన్ని బ్రహ్మాండంగా నిర్వహిస్తాం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తాం” అని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, మేయర్ కొలగాని శ్రీనివాస్ డిప్యూటీ మేయర్ వై. సునీల్ రావు, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రెడ్డి, కరీంనగర్ ఆర్డీవో షర్మిలతో పాటు వివిధ శాఖల అధికారులు ప్రజా ప్రతినిధులు స్థానిక కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
## లోకల్ యాడ్స్ ##
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ రావుల వెంకట్ గారు జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి (కాట్రపల్లి), హుజురాబాద్.





