
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : భూవివాదం కారణంగా ఆత్మహత్య చేసుకున్న మృతుడు కన్నబోయిన ఓదెలు కుటుంబానికి న్యాయం చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజనీ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. మంగళవారం హుజూరాబాద్ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ…. హుజూరాబాద్ మండలం వెంకట్రావుపల్లికి చెందిన కన్నబోయిన ఓదెలు 2018లో పత్తి విష్ణువర్ధన్ రెడ్డి నుంచి 1 ఎకరం 4 గుంటల భూమిని సాదా బైనామా ద్వారా 10.40 లక్షలు చెల్లించి కొనుగోలు చేశారు. అయితే కుటుంబ తగాదాలు, న్యాయపరమైన వివాదాల వల్ల ఆ భూమి రిజిస్ట్రేషన్ ఆలస్యమైంది.
దీన్ని ఆసరాగా చేసుకున్న గ్రామ సర్పంచ్ భర్త పత్తి కృష్ణారెడ్డి, 2022లో రెవెన్యూ అధికారులతో కలిసి ఆ భూమిని తన పేరిట నమోదు చేసుకున్నారని అన్నారు. గతంలో తీసుకున్న పూర్తి మొత్తాన్ని చెల్లించకుండా, కేవలం 2.70 లక్షలు మాత్రమే ఇస్తానని, “దిక్కున్న చోట చెప్పుకోండంటూ” బెదిరింపులకు పాల్పడడంతో తీవ్ర మనస్తాపంతో ఓదేలు గత నెల 2న క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా, చికిత్స పొందుతూ 3న మృతి చెందారని పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా నిందితుడు అధికార పార్టీకి చెందిన నాయకుడు కావడంతో పోలీసులు అరెస్టు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని,
బాధిత యాదవ కుటుంబానికి న్యాయం జరిగే వరకు తాము అండగా ఉంటామని, తక్షణమే నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్ హెచ్ ఓ కు వినతిపత్రం అందజేశామని తెలిపారు. కరీంనగర్ సీపీ, ఏసీపీలకు ఫిర్యాదు చేస్తామని అన్నారు . పత్తి కృష్ణారెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి బాధిత కుటుంబానికి భూమి దక్కేలా చేయకపోతే పోరాటం చేస్తామని హెచ్చరించాడు.
ఈ సమావేశంలో టీఆర్పీ మండల అధ్యక్షుడు తిరగమల్ల నాగార్జున, బొడ్డు దేవదాస్, బొడ్డు సుమన్, ఇమ్మడి ఉదయ్ కుమార్, తామన్ రామన్ కుమార్, మృతుని కుమారుడు కన్నెబోయిన కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.





