
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధిహుజురాబాద్: రాజకీయ దురుద్దేశంతో, కుట్రపూరితంగానే కొందరు పనిగట్టుకుని తన వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు తప్పుడు ఆరోపణలు, అసత్య ప్రచారాలకు తెగబడుతున్నారని వెంకట్రావుపల్లి సర్పంచ్ అనిత భర్త, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పత్తి కృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆధారాలు లేని ఆరోపణలతో తన ప్రతిష్టను దిగజార్చాలని చూస్తే చూస్తూ ఊరుకునేది లేదని, న్యాయస్థానాల ద్వారా చట్టపరమైన గుణపాఠం చెబుతానని ఆయన హెచ్చరించారు.
బుధవారం హుజురాబాద్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రజిని కుమార్ యాదవ్ తనపై చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఆ ఆరోపణల్లో రవ్వంతైనా నిజం లేదని, పూర్తిగా కల్పిత కథనాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.
అంతా చట్టబద్ధమే.. ఏ తప్పూ చేయలేదు: పత్తి కృష్ణారెడ్డి
వివాదంగా చిత్రీకరిస్తున్న భూ వ్యవహారంపై స్పష్టతనిస్తూ పత్తి కృష్ణారెడ్డి పూర్తి వివరాలు వెల్లడించారు. 2019లోనే తన సొంత సోదరుడు పత్తి విష్ణువర్ధన్ రెడ్డి నుంచి అన్ని ప్రభుత్వ నిబంధనలకు లోబడి, చట్టబద్ధంగా ఎకరం నాలుగు గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు పత్రాలతో సహా స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అక్రమాలకు తావులేదని, అంతా పారదర్శకంగా జరిగిందని తేల్చిచెప్పారు.
భూమిని కాజేయాలనే కుట్ర?
ఈ వ్యవహారంలో ఆరోపణలు చేస్తున్న మృతి చెందిన ఓదెలుతో గానీ, ఆయన కుమారుడితో గానీ తనకు ఎలాంటి ప్రత్యక్ష ఆర్థిక సంబంధాలు గానీ, లావాదేవీలు గానీ లేవని కృష్ణారెడ్డి కుండబద్దలు కొట్టారు. తన సోదరుడు విష్ణువర్ధన్ రెడ్డికి సంబంధించిన బకాయిల అంశం వచ్చినప్పుడు కూడా, కుటుంబ బాధ్యతగా ఆ బాకీ మొత్తాన్ని చెల్లించేందుకు తాను ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నానని తెలిపారు.
గతంలోనే బాకీ కింద రూ. 2.70 లక్షల చెక్కును ఇచ్చేందుకు ముందుకు వచ్చినా, కావాలనే వారు తిరస్కరించారని గుర్తుచేశారు. బాకీ సొమ్ము తీసుకోవడం వారి ఉద్దేశం కాదని, ఎలాగైనా ఆ విలువైన భూమినే లాక్కోవాలనే దురాశతోనే కొందరి అండదండలతో ఈ రకమైన బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
హద్దు మీరితే న్యాయపోరాటమే…
వాస్తవాలు ఇలా ఉంటే, రాజకీయ లబ్ధి కోసమే తనపై అసత్యాలు ప్రచారం చేస్తూ సమాజంలో తన పరువు తీయాలని చూస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ఈ తప్పుడు ప్రచారాలు, దుష్ప్రచారాలను తక్షణమే మానుకోవాలని, లేనిపక్షంలో పరువు నష్టం దావాతో పాటు క్రిమినల్ చర్యలకు వెనుకాడబోనని పత్తి కృష్ణారెడ్డి హెచ్చరించారు.
@@లోకల్ యాడ్స్@@
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శ్రీమతి ఆలేటి సుశీల గారు, కో ఆప్షన్ సభ్యురాలు హుజురాబాద్ పురపాలక సంఘం, కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు.





