
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్ : చెల్లెలు డాక్టర్ కోర్సు చదువుతుండగా అక్క మాత్రం దానికి భిన్నంగా సాఫ్ట్వేర్ కంపెనీని ఎంచుకుంది. అయితే నేమ్ ప్రతిభ ఉంటే దేనిలోనైనా రాణించవచ్చని నిరూపించింది అక్క. వివరాల్లకి వెళితే ..హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికలపేట గ్రామానికి చెందిన యాల్ల సదిరెడ్డి – అంజలిలకు ఇద్దరు కూతుర్లు. పెద్ద కూతురు కృష్ణవేణి చిన్న కూతురు హరిప్రియ. జీవనోపాధి కోసం కొన్నేళ్ళ క్రితం సదిరెడ్డి హుజురాబాద్ కు వచ్చి స్థానిక కపిల్ చిట్ ఫండ్ లో చిరు ఉద్యోగిగా చేరి ఓ ఇల్లు అద్దెకు తీసుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే అతని పెద్ద కూతురు కృష్ణవేణి పట్టణంలోని గ్రీన్ సెడ్జి పాఠశాలలో 10వ తరగతి వరకు, ఇంటర్మీడియట్ ఆల్ ఫోర్స్ కళాశాల కరీంనగర్లో చదువుకొని బీటెక్ కంప్యూటర్ సైన్స్ ను అనంతసాగర్ లోని ఎస్సార్ ఇంజనీరింగ్ కళాశాలలో పూర్తి చేసింది. చెల్లెలు డాక్టర్ కోర్స్ రెండవ సంవత్సరం చదువుతుండగా అక్క మాత్రం కృషి పట్టుదలతో ఎలాగైనా సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించాలని కష్టపడింది. కంప్యూటర్ సైన్స్ కోర్స్ చదువుతూ ఉండగానే మూడో సంవత్సరంలోనే యూఎస్ కంపెనీ పేపాల్ లో ప్లేస్మెంట్ సాధించి యాల్ల కృష్ణవేణికి రూ. 34.4 లక్షల భారీ ప్యాకేజీతో ఉద్యోగంకు ఎంపికై అందరికీ ఆదర్శంగా నిలిచింది. ముందుగా కృష్ణవేణి ఒక సంవత్సరం హైదరాబాదులో ఇంటెన్ షిప్ పూర్తి చేసి అదే సంస్థలో ఏడాదికి 34.4 లక్షల భారీ ప్యాకేజీ ఇస్తూ ఉద్యోగంలోకి తీసుకోవడంతో పట్టలేని సంతోషానికి గురి చేసింది. మన దేశంలో గూగుల్ పే, ఫోన్ పే, మాదిరిగానే పేపాల్ కంపెనీ అమెరికాలో పనిచేస్తుంది. ఈ సందర్భంగా కృష్ణవేణి మాట్లాడుతూ ఈనెల 15న హైదరాబాదులోని తమ కంపెనీలో ఉద్యోగంలో చేరడం జరుగుతుందని తెలిపారు. తన తండ్రి సదిరెడ్డి కపిల్ చిట్ ఫండ్ లో కష్టపడి పని చేస్తూ అంచలంచలుగా అసిస్టెంట్ మేనేజర్ స్థాయికి ఎదిగారని తెలిపారు. మా అమ్మ గృహిణిగా ఉంటూ కుటుంబానికి చేదోడువాదోడుగా మారారన్నారు. మధ్యతరగతి కుటుంబమైనప్పటికి తన తండ్రి కష్టపడి తమ ఇద్దరినీ చదివించాడని తెలిపారు. ఆయన ఆశలను నిరాశపరచకుండా క్రమశిక్షణతో కష్టపడి చదివి భారీ ప్యాకేజీతో పేపాల్ లో ఉద్యోగం సంపాదించడం జరిగిందని, ఈ ఉద్యోగం రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇంత భారీ ప్యాకేజీతో ఈ ప్రాంతంలో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం పొందిన యాల్ల కృష్ణవేణిని, కుటుంబ సభ్యులను స్థానిక గ్రీన్ సెడ్జ్ స్కూలు యాజమాన్యం, కాకతీయ కాలనీ ప్రజలు, ప్రజాప్రతినిధులు, పలువురు అభినందనలు తెలిపారు.






