
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పట్టణంలోని 23వ వార్డులో గల బుడగ జంగం కాలనీ పూర్తిగా వర్షపు నీటితో నిండిపోయింది. ఈ కాలనీలో దాదాపు 300 మంది బుడగ జంగాల ప్రజలు, పిల్లాపాపలతో గుడిసెలు వేసుకుని అనేక సంవత్సరాల నుండి నిరుపేద జీవితాలను గడుపుతున్నారు. నిన్న మొన్నటి భారీ వర్షాల వల్ల అనేక గుడిసెలపై గల తాత్కాలిక పైకప్పులు కొట్టుకుపోగా, దాదాపు మొత్తం గుడిసెలు సగం నీటిలో కూరుకుపోవడంతో వస్తువులు, దుస్తులు, పక్క బట్టలు, రేషన్ బియ్యం ఇతర సరుకులు నీట మునిగిపోవడంతో వారు వీధుల పాలయ్యారు. ఏ ఒక్కరూ స్పందించకపోవడంతో వారి పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ బుడగ జంగాల కాలనీ మొత్తం ఒక చిన్న పాటి చెరువులా తయారైంది. సోమవారం రోజున కాంగ్రెస్ నేత ప్రణవ్ ప్రత్యేకంగా బుడగ జంగాల కాలనీలో పర్యటించి ప్రతి ఇంటిని పరిశీలించారు. అలాగే ప్రతి కుటుంబాన్ని పలకరించి జరిగిన నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా 23వ వార్డు బుడగజంగాలు వోడితల ప్రణవ్ మాట్లాడుతూ తాము వర్షాలు వచ్చినప్పుడల్లా ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కొంటున్నామని… తమకు స్వంత గృహాలు లేవని… రోడ్లు డ్రైనేజీలు కూడా లేవని… కూలి నాలి చేసుకుంటూ పిల్లాపాపలతో నిరుపేద జీవితాలను గడుపుతున్నట్లు తమ గోడును వెళ్ళబోసుకున్నారు. ఇదంతా విని చెలించిపోయిన ప్రణవ్ బాబు తాను తప్పకుండా మీ వార్డు సమస్యలను తక్షణమే జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ దృష్టికి తీసుకువెళ్తాననీ వారి ద్వారా ప్రభుత్వం దృష్టి కూడా మీ సమస్యలను తీసుకెళ్లి వాటి పరిష్కారం కోసం శాయా శక్తుల కృషి చేస్తానని బుడిగ జంగాలకు ఈ సందర్భంగా ప్రణవ్ హామీ ఇచ్చారు. కాగా బుడగ జంగాల కాలనీలో అక్కడి బాధితుల సమక్షంలోనే హుజురాబాద్ మునిసిపల్ కమిషనర్ కు ప్రణవ్ ఫోన్ చేసి తక్షణమే 23వ వార్డులో పర్యటించి ఇప్పటికిప్పుడు తీసుకోవలసిన చర్యలను తీసుకోవాలనీ, అలాగే వారికి సంబంధించిన సమస్యలను పూర్తిగా తెలుసుకొని ఒక నివేదికను తయారు చేయాలని కోరారు. రోడ్లు డ్రైనేజీ విషయంలో ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఉందని ప్రణవ్ మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ పర్యటనలో ప్రణవ్ వెంట కాంగ్రెస్ నాయకులు ఎర్ర రమేష్, రవీందర్, సొల్లు బాబు, దశరథం, మేకల తిరుపతి, వేముల పుష్పలత, ప్రతాప నాగరాజు పటేల్, కె ఆర్ బిక్షపతి, మిడిదొడ్డి రాజు, గడ్డం రాఘవేందర్, సిరిపాటి వేణు, ఎర్ర నాగరాజు, ఆలీం, చంద్రశేఖర్ కాలీద్ హుస్సేన్, రియాజ్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.









