
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: రాష్ట్ర బిజెపి ఓబీసీ మోర్చ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను అమలు చేయకుండా కాలయాపన చేస్తున్న దానికి నిరసనగా..హుజురాబాద్ పట్టణంలో తహసీల్దార్ కి ఓబీసీ మోర్చ పట్టణ మరియు మండల శాఖ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి ఎన్నికల సభలో బీసీ డిక్లరేషన్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని బీసీలకు కింది విషయాలపై హామీ ఇచ్చారన్నారు.
1) రిజర్వేషన్లు : ప్రభుత్వంలోకి వచ్చిన ఆరు నెలల లోపే కులగణన చేసి బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా బీసీలకు రిజర్వేషన్లు పెంచుతామన్నారు. స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లు 23 శాతం నుండి 42 శాతానికి పెంచుతామని హామీ ఇచ్చారన్నారు. ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్స్, మెయింటెనెన్స్ కాంట్రాక్టులలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్నారు.
2)గొల్ల కురుమలకు అధికారంలో వచ్చిన 100 రోజుల్లోనే రెండవ దశ గొర్రెల పంపిణీ కి సంబంధించి రెండు లక్షల రూపాయలు లబ్ధిదారుని ఎకౌంట్లో వేస్తామన్న హామీ మరిచి గొల్ల కురుమలను మోసం చేశారు.
3)బీసీ సబ్ ప్లాన్ కు తగిన నిధులు మంజూరు చేసేందుకు మొదటి అసెంబ్లీ సెషన్ లోనే చట్టబద్ధమైన హోదాతో జ్యోతిరావు పూలే బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటుచేసి ఏడాదికి 20వేల కోట్ల రూపాయల చొప్పున ఐదేళ్లలో లక్ష కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చి 8 నెలలు గడుస్తున్న నిధుల విషయం పైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
4) ఎంబీసీ కులాలకు ప్రత్యేక సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయలేదు.అన్ని బీసీ కులాల సమగ్ర అభివృద్ధికి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీ యువతకు చిరు వ్యాపారాలు నిర్వహించుకునేందుకు మరియు ఉన్నత విద్య కోసం వడ్డీ లేకుండా, పూచికత్తు లేకుండా పది లక్షల రుణాలు ఇస్తామని హామీ ఇచ్చి మరిచిపోయారు.
5)బీసీ కుటుంబాల యువతకు ర్యాంకుతో సంబంధం లేకుండా మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ ఆరు నెలల్లోగా ఇస్తామని ఇవ్వకుండా బీసీ యువతను ఉద్యోగాలకు అర్హత లేకుండా చేస్తున్నారు.
6)సమయం గడుస్తున్నప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్య సంఘాలకు చేప పిల్లల పంపిణీ చేయకుండా, బిడ్లు ఆహ్వానించి 100 కోట్ల రూపాయల వరకు అవినీతికి తెర లేపినట్టుగా అర్థమవుతుంది.
7)ముదిరాజ్, గంగపుత్ర, గౌడ్, మున్నూరు కాపు, పద్మశాలి, విశ్వకర్మ, రజక సామాజిక వర్గాలకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చేందుకు ఎటువంటి చర్యలు గాని, కనీసం క్యాబినెట్లో నిర్ణయాలు గాని తీసుకోలేదు..పై విషయాలకు నిరసనగా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో మీకు నిరసన తెలియజేస్తూ తద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని వారు కోరారు. ప్రభుత్వం వెంటనే వారం రోజుల్లో పై విషయాలపైన చర్యలు ప్రారంభించకపోతే లక్షల మంది బీసీలతో అన్ని కలెక్టరేట్లలో ధర్నాలు నిరసన దీక్షలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చ హుజురాబాద్ పట్టణ అధ్యక్షులు గంట సంపత్, ఓబీసీ మోర్చ మండల అధ్యక్షుడు మండల సాయిబాబా, జిల్లా కార్యవర్గ సభ్యులు గంగిశెట్టి ప్రభాకర్, బీజేపీ నాయకులు నల్ల సుమన్, బోరగల సారయ్య, మునిగంటి నాగరాజు, పంజాల రేవంత్, ఆవుల సదయ్య, కొలిపాక వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.






