
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర నష్టం జరిగిందని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఆయన బడ్జెట్ ని ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఢిల్లీలో తిరుగుతూ సోషల్ మీడియాలో హెక్టీక్ డే అని పెట్టారని, హెక్టిక్ డే అని తిరుగుతూ కనీసం సెప్టిక్ ట్యాంక్ కట్టే పైసలు కూడా తేలేదని ఎద్దేవా చేశారు. మన పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ 15 వేల కోట్లు బడ్జెట్లో తీసుకువెళ్లారని, కనీసం తెలంగాణకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తేకపోవడం సిగ్గుచేటని, తెలంగాణ ప్రజలు బిజెపికి ఎనిమిది పార్లమెంట్ సీట్లు ఇచ్చినప్పటికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా గుండు సున్నా చూపించారని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బిజెపి పార్టీలు పార్లమెంటు ఎన్నికల్లో చరో 8 గెలుచుకున్నప్పటికీ బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణపై వివక్ష చూపిస్తే కనీసం ఖండించకుండా ఏమి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంజాబ్ కు బడ్జెట్లో అన్యాయం జరిగిందని వారి ఎంపీలు అక్కడే నిరసన తెలిపారని, తెలంగాణ ఎంపీలు మౌనం ఎందుకు పాటించారని అన్నారు. తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా ఆలోచించాలని తెలంగాణకు కెసిఆరే శ్రీరామరక్ష అని అన్నారు. బడ్జెట్ విషయంలో అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కచ్చితంగా కాంగ్రెస్ బిజెపి లను నిలదీస్తామని అన్నారు. ఇప్పటికైనా రెండు పార్టీల ఎంపీలు డ్రామాలు ఆపి తెలంగాణ హక్కుల కోసం కొట్లాడాలని అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ను ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు రుణమాఫీ రెండు లక్షలు ఏకకాలంలో చేశామని పేపర్ యాడ్స్ ఇచ్చుకుంటున్న కాంగ్రెస్ను నిలదీస్తామని అన్నారు. ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ ఎవరికి ఇచ్చారో చూపించాలని, లక్ష రూపాయల రుణమాఫీ లోనే చాలా మందికి రుణమాఫీ కాలేదని రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, డాక్టర్ వివేకనంద తదితరులు పాల్గొన్నారు.






