
మండల యాదగిరి, స్వర్ణోదయ ప్రతినిధి కరీంనగర్ (సిరిసిల్ల): రాజన్న సిరిసిల్ల జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లి వద్ద ఆగి ఉన్న లారీని కారు అతివేగంగా అజాగ్రత్తగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్ గ్రామానికి చెందిన పోలవేణి మంగ మృతి చెందింది. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని కరీంనగర్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. తీవ్ర గాయాలయిన ముగ్గురు కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.





