
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, సెప్టెంబర్ 10: వీర వనిత చాకలి ఐలమ్మ పోరాటం, ధైర్య సాహసాలు యువతకు స్ఫూర్తి అని హుజురాబాద్ రజక సంఘం నాయకులు కొనియాడారు. హుజురాబాద్ పట్టణంలోని చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద, 40వ వర్ధంతి వేడుకలను మున్సిపల్ కమిషనర్ కే సమ్మయ్య ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. వెట్టి చాకిరీ, బానిస బతుకులు అనుభవిస్తూ కూడా దొరలు, దేశముఖీలు, రజాకార్ల దౌర్జన్యాలను ధైర్యంగా ఎదుర్కొని వీరవనితగా చాకలి ఐలమ్మ తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయ స్థానం సంపాదించుకున్నారని అన్నారు. ఆమె భర్త, కుమారులు కమ్యూనిస్టు ఉద్యమంలో పాల్గొని పోరాడుతుంటే, ఐలమ్మ ఊరిలో జరుగుతున్న అన్యాయాలను సంఘానికి తెలియజేసి, ప్రజలను రజాకార్ల దాడుల నుంచి రక్షించేదని అన్నారు. రజాకార్ల దాడి సమయంలో చేదబావిలో దూకి ప్రాణాలను రక్షించుకున్న ఘటన ఆమె ధైర్యసాహసానికి నిదర్శనమని తెలిపారు. బాంచెన్ దొరా కాల్మొక్తా అంటూ సాగిన ఐలమ్మ భూపోరాటమే తరువాత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పునాదిగా మారిందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో రజక యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నిమ్మటూరి సాయికృష్ణ, రజక సంఘం అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, రజక సంఘం నాయకుడు కొలిపాక శంకర్, హుజురాబాద్ మండల అధ్యక్షుడు సుంకరి రాజమౌళి, మాజీ కౌన్సిలర్ ముక్క రమేష్, నాయకుడు నల్ల సుమన్, మున్సిపల్ మేనేజర్ భూపాల్ రెడ్డి, ఆర్ ఐ రమేష్, ప్రజాసంఘాల నాయకులు వేల్పుల ప్రభాకర్, కొండ్ర నరేష్, నల్ల సదానందం, తెలంగాణ రామ్ రెడ్డి, ప్రతాప రాజు, ఆల్లి రమేష్, అనిల్, ఆర్ సుధీర్, జీ అనిల్ తదితరులు పాల్గొన్నారు.

ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేస్తున్న రజక యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నిమ్మటూరి సాయికృష్ణ, రజక సంఘం అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, కమిషనర్ సమ్మయ్య, రజక సంఘం నాయకుడు కొలిపాక శంకర్, హుజురాబాద్ మండల అధ్యక్షుడు సుంకరి రాజమౌళి తదితరులు..

ఐలమ్మ విగ్రహానికి నివాళులర్పిస్తున్న రజక, వివిధ సంఘాల నాయకులు..





