
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: తొమ్మిది రోజులపాటు తెలంగాణ మహిళలు భక్తిశ్రద్ధలతో, సాంప్రదాయ బద్ధంగా జరుపుకునే బతుకమ్మ పండుగ వేడుకలు సోమవారం సద్దుల బతుకమ్మ పండుగతో ముగిసాయి. ఆశ్వయుజ అమావాస్య రోజు నుండి ప్రారంభమయ్యే బతుకమ్మ పండుగ వేడుకలు తొమ్మిది రోజులపాటు రోజుకో తీరు పేర్లతో బతుకమ్మలను పేరుస్తూ చివరి రోజైన అష్టమి రోజున సద్దుల బతుకమ్మ పేరుతో సాంప్రదాయ బద్ధంగా మహిళలు ఆడుకుంటారు. హుజురాబాద్ పట్టణంలో సద్దుల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా సోమవారం రాత్రి మహిళల సంతోషాల మధ్య పిల్లల కేరింతల మధ్య అట్టహాసంగా ముగిసాయి. సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలు గునుగు పువ్వు, తంగేడు పువ్వు, బంతి పువ్వు, చామంతి పువ్వు, కట్లపువ్వు, తామర పువ్వు లాంటి అనేక పువ్వులతో బతుకమ్మను పేర్చి పైన గౌరమ్మ పెట్టి తమ కుటుంబాన్ని చల్లగా చూడాలని మహిళలు వేడుకున్నారు. సాంప్రదాయ దుస్తుల్లో ఉన్న మహిళలు పేర్చిన బతుకమ్మను తీసుకొని పట్టణ శివారులో ఉన్న బతుకమ్మ మైదానం(బతుకమ్మ సౌళ్ళు) వద్దకు తీసుకొని వచ్చారు. బతుకమ్మ…..బతుకమ్మ ఉయ్యాల…. బంగారు బతుకమ్మ ఉయ్యాలో, ఒక్కేసి పువ్వేసి …చందమామ…ఎన్ని జాములాయి చందమామ… శ్రీలక్ష్మి నీ మహిమలు గౌరమ్మ…నిత్యమై తోచునమ్మ గౌరమ్మ…అంటూ మహిళలు లయబద్ధంగా చేతులతో చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ ఆడుకున్నారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా తమతో తీసుకుని వచ్చిన సత్తిపిండి నువ్వుల పిండి పెసర పిండి పల్లి పిండి, దద్దోజనం పులిహోర సీతాఫలం లాంటి సాంప్రదాయ బద్ధమైన సద్దులను ఇతరులకు వాయనాలు ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ సందర్భంగా తీపితిని తియ్యగా మాట్లాడు… కమ్మటిది తిని అందరితో కలిసి ఉండు అంటూ చెప్పుకున్నారు. అనంతరం బతుకమ్మను తీసుకొని నీటి లో వదిలి గౌరమ్మ తల్లి పోయిరావమ్మా మల్లొచ్చి ఏడాది మా ఇంటికి రావాలమ్మా, మా కుటుంబాన్ని చల్లగా చూడాలంటూ వేడుకున్నారు. అనంతరం తాము ఇంట్లో నుండి తీసుకొని వచ్చిన ఏడు రకాల పిండిలను ఇతరులకు ఇచ్చి తీపిదిని తీయగా మాట్లాడు నువ్వులు తిని నూరేళ్లు బతుకు అంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
— అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలు…..
హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ కేంసారపు సమ్మయ్య ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ వేడుకల కోసం బతుకమ్మ మైదానాన్ని సర్వాంగ సుందరంగా తయారుచేసి రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరింప చేశారు. బతకమ్మ మైదానంలో మహిళలు ఆడుకోవడానికి పచ్చని తివాచీ పరిచారు. వేలాదిమంది మహిళలు ప్రజలు హాజరయ్యే ఈ బతుకమ్మ పండుగ వేడుకల్లో మహిళలు పసిపాపలు ఉన్న తల్లులు ఇబ్బంది పడకూడదని మహిళల కోసం ప్రత్యేకంగా డ్రెస్సింగ్ రూమ్ పిల్లలకు తల్లులు పాలు ఇవ్వడానికి కోసం ప్రత్యేకంగా ఫీడింగ్ రూమును ఏర్పాటు చేశారు. హుజురాబాద్ ఎసిపి వాసంశెట్టి మాధవి, టౌన్ సిఐ టి. కరుణాకర్ ల ఆధ్వర్యంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మహిళలు బతుకమ్మలను తీసుకొని వచ్చే మార్గంలో వాహనాలకు అనుమతి ఇవ్వకుండా మహిళలు మాత్రమే వెళ్లే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా అందమైన బతుకమ్మలను పేర్చిన మహిళలకు మున్సిపల్ ఆధ్వర్యంలో బహుమతులు అందజేశారు. బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూరి వెంకట్, కాంగ్రెస్ యువనేత వొడితల ప్రణవ్ బాబు, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ దంపతులు గందె రాధిక శ్రీనివాస్, మాజీ వాయిస్ చైర్ పర్సన్ దంపతులు కొలీపాక నిర్మల శ్రీనివాస్, మున్సిపల్ మేనేజర్ భూపాల్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.














హుజురాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ నేత ప్రణవ్ బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న దృశ్యాలు..
————————-++++++++—————–
##పత్రికా ప్రకటనలు##
&&సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు&&






