
–హక్కుల సాధనే లక్ష్యంగా ఫిబ్రవరి 23న ఓసి జేఏసీ ఆధ్వర్యంలో ఢిల్లీలో జాతీయస్థాయి ఓసిల మహాధర్నా.
–పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిని పరామర్శించిన పోలాడి రామారావు…
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్ (పెద్దపల్లి): నగరపాలక సంస్థలు,పురపాలక సంఘాలకు త్వరలో జరగనున్న ఎన్నికల వార్డు రిజర్వేషన్లలో ఓసిలకు తీరని అన్యాయం జరిగిందని ఓసి సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ఆరోపించారు. శనివారం పెద్దపల్లి జిల్లా కేంద్ర సమీపంలోని కాసులపల్లిలో నిర్వహించిన ఓసి ఐకాస రాష్ట్ర జిల్లా నాయకుల సమావేశంలో, ఓసి జేఏసీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 23న ఢిల్లీలో నిర్వహించ తలపెట్టిన జాతీయస్థాయి ఓసిల మహాధర్నా గోడ ప్రతులను ఓసి ఐకాసరాష్ట్ర నాయకులతో కలిసి పోలాడి రామారావు ఆవిష్కరించి మాట్లాడారు. మునిసిపల్ రిజర్వేషన్లలో ఓసిలను అణగతొక్కాలనే పాలకుల బ్యూరో క్రాట్ల కుట్ర స్పష్టంగా బయట పడిందన్నారు.
ఓసిల జనాభా 80 శాతం ఉన్న వార్డులు,డివిజన్లు ఎస్సీ,ఎస్టీ, బీసీలకు రిజర్వు కాగా, ఎస్సీ, ఎస్టీ బీసీలు 79 నుంచి 89 శాతం ఉన్న ప్రాంతాలను జనరల్ కేటగిరీలో చేర్చడం ఈ కుట్రకు నిదర్శనం అన్నారు. ప్రస్తుతం జనరల్ కేటగిరీకి రిజర్వ్ చేయబడిన స్థానాల్లో ఓసియేతరులు 80 శాతం ఉండటంతో ఓసిలు
అక్కడ గెలుపొందే పరిస్థితి లేదన్నారు. ప్రస్తుత ఎన్నికల ప్రక్రియను రద్దు చేసి శాస్త్రీయంగా లేని రిజర్వేషన్ల మార్పుపై తక్షణమే ఒక నిర్ణయం తీసుకోని పక్షంలో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఓసీలు ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడం తధ్యమని, తమ డిమాండ్లకు మద్దతు తెలుపని రాజకీయ పార్టీల అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేసి ఒడిస్తామని పోలాడి రామారావు హెచ్చరించారు.
జనరల్ స్థానాల్లో కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలతో ఓసీయేతరులకు కొన్ని రాజకీయ పార్టీలు టికెట్లు ఇచ్చి ఓసి లకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. స్ధానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇదే విధమైన విధానాలు అనుసరించడం వల్ల చేయడం వల్ల ఓసీలు సర్పంచ్ అవకాశాలు కోల్పోయారని రామారావు వెల్లడించారు.
ఓసీలకు రాజకీయ ప్రాధాన్యత కోసం ఓసి జేఏసీ రాష్ట్ర, జాతీయ స్థాయిలో చేస్తున్న పోరాటానికి రాజకీయాలకు అతీతంగా ఓసీలు కలిసి రావాలని, ఐక్యంగా ప్రభుత్వాల మెడలు వంచాలని రామారావు పిలుపు నిచ్చారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పటిష్ట అమలుకు జాతీయస్థాయిలో ఓసి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని, ప్రస్తుతమున్న 50 శాతం దాటని రిజర్వేషన్లలో ఓసిలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని, ఈడబ్లూఎస్ అర్హతకు వార్షికాదాయం 10 లక్షలకు పెంచాలని, రైతు భీమాకు వర్తించే వయోపరిమితిని, 70ఏళ్లకు పెంచాలని, రైతులు పండించే ధాన్యానికి రైతులే గిట్టుబాటు ధర నిర్ణయించే భాగస్వామ్యం ఉండాలనే డిమాండ్లతో పాటు ఇతర ఓసిల డిమాండ్ల సాధనకు ఓసి జేఏసీ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఫిబ్రవరి 23న నిర్వహించ తలపెట్టిన జాతీయస్థాయి ఓసిల మహాధర్నాకు రాజకీయాల కతీతంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఓసి సామాజిక వర్గీయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని రామారావు పిలుపు నిచ్చారు.కాగా అంతకు ముందు ఇదే రోజు అనారోగ్య కారణాల వల్ల మృతి చెందిన పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సోదరుడు రఘునందన్ రెడ్డి మృత దేహంపై పెద్దపల్లి పట్టణ సమీపంలోని కాసర్ల పల్లి గ్రామంలోని వారి నివాసంలో నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించి దాసరి మనోహర్ రెడ్డిని, వారి కుటుంబ సభ్యులను పోలాడి రామారావు పరామర్శించి, ఓదార్చి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓసి జేఏసీ పెద్దపల్లి జిల్లా చైర్మన్ బైరెడ్డి రాంరెడ్డి, ఓసి ఐకాస నాయకులు ఎర్రం మల్లారెడ్డి, ఏర్రం ప్రభాకర్ రెడ్డి, అడప బాపురెడ్డి, సిద్దూరి బుచ్చం రావు, వంగల తిరుపతిరెడ్డి, చింతిరెడ్డి తిరుపతిరెడ్డి, కొత్తిరెడ్డి సంపత్ రెడ్డి, కనకయ్య, రమేష్, విజయి కుమార్, సతీశ్ శర్మ పాల్గొన్నారు.


జాతీయస్థాయి ఓసిల మహాధర్నా గోడ ప్రతులను ఓసి ఐకాసరాష్ట్ర నాయకులతో కలిసి ఆవిష్కరించి నినాదాలు చేస్తున్న జాతీయ నాయకుడు పోలాడి రామారావు, ఇతర నాయకులు..

మాట్లాడుతున్న జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దాసరి మనోహర్ రెడ్డి సోదరుడు రఘునందన్ రెడ్డి మృత దేహంపై పూలమాలవేసి నివాళులర్పిస్తున్న రామారావు..






