
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఓసిల న్యాయమైన డిమాండ్ల సాధనకు ఈ నెల 23న డిల్లీలో జాతీయస్థాయి ఓసిల మహా ధర్నా నిర్వహిస్తున్నట్లు ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తెలిపారు. ఈ మహా ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. ఈ మేరకు డిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించ తలపెట్టిన జాతీయ స్థాయి ఓసిల మహా ధర్నాకు మద్దతు తెలపాలని శనివారం పార్లమెంట్ సభ్యుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ నూ ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు కోరుతూ నాయకులతో కలిసి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని, మహాధర్నా ఆహ్వాన పత్రం అందజేశారు. ఈటల రాజేందర్ సానుకూలంగా స్పందించారని రామారావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ అగ్రవర్ణాల్లోని ఆర్ధికంగావెనుక బడి ఉన్నవారు రిజర్వేషన్లు లేమి కారణంగా అటు సంక్షేమ పథకాలఫలాలు, ఇటు రాజకీయ పదవులు పొందలేక పోతున్నారని అన్నారు. ఓటు బ్యాంక్ రాజకీయాలతో మున్సిపల్ వార్డు రిజర్వేషన్లలో ఓసి లకు తీవ్ర అన్యాయం జరిగి అవకాశాలు కోల్పోయారని మండిపడ్డారు. రాజ్యాంగ బద్దంగా ఏర్పడ్డ 10శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పై రాజకీయ పబ్బం కోసం కొందరు ఆయా కులాల్లోని ప్రజలను మభ్యపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నిరుపేద ఓసిలు ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జనరల్ స్థానాల్లో సైతం ఓసిలు తట్టుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. హన్మకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీలో 16డివిజన్లు జనరల్ కేటగిరీకి రిజర్వు కాగా 12చోట్ల ఓసిలు పోటీ చేయలేక పోయారన్నారు. అలా రాష్ట్ర వ్యాప్తంగా ఓసిలు ఆర్థిక పరిస్థితులు, అధికార పార్టీ నేతల బెదరింపుల కారణంగాపోటీకి దూరంగా ఉన్నారన్నారు. జనరల్ స్థానాల్లో కూడా ఓసి లకు రాజకీయ పార్టీలు అవకాశం ఇవ్వక పోవడం వల్ల రాజకీయంగానూ వెనుక బడి పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్ధికంగా వెనుకబడి ఉన్నవారికి చేయూత నిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పిస్తే వాటిపైనా దుష్ప్రచారం చేయడం తగదన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పటిష్టంగా అమలు చేసేందుకు జాతీయ ఈడబ్ల్యూఎస్ కమిషన్ ను ఏర్పాటు చేయాలని రామారావు డిమాండ్ చేశారు. ఐకాస రాష్ట్ర నాయకులు గౌతంరెడ్డి, సమ్మిరెడ్డి, సంపత్ రావు, రమణయ్య, బుచ్చిరెడ్డి, ఉపేందర్, చంద్ర గుప్త తదితరులు పాల్గొన్నారు.


ఢిల్లీలో మహాధర్నాకు హాజరుకావాలని ఆహ్వాన పత్రాన్ని ఎంపీ ఈటెల రాజేందర్ కు అందజేస్తున్న ఓసీ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..





