
– హుజూరాబాద్‌లో రజక మహిళల భారీ నిరసన.
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్ : నాగర్ కర్నూల్ మండలం కుమ్మెర మల్లన్న జాతరలో రజక కుటుంబంపై అమానుషంగా దాడి చేసి, రెండు నెలల పసికందు మృతికి కారణమైన అగ్రకుల అహంకారులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని రాష్ట్ర రజక కార్యదర్శి కొలిపాక సారయ్య, రజక యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నిమ్మటూరి సాయికృష్ణ డిమాండ్ చేశారు. సోమవారం హుజూరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రజక మహిళలతో కలిసి ఆయన భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. అమానుష దాడిని ఖండిస్తూ..
ఈ సందర్భంగా సాయికృష్ణ మాట్లాడుతూ, మల్లన్న దర్శనం కోసం వెళ్లిన చాకలి చంద్రకళ కుటుంబాన్ని అడ్డుకోవడం సభ్య సమాజం తలదించుకోవాల్సిన విషయమని మండిపడ్డారు. కులం పేరుతో దూషిస్తూ, ఆలయంలోకి ప్రవేశం లేకుండా అడ్డుకోవడమే కాకుండా, ఎదురు తిరిగినందుకు కుటుంబ సభ్యులపై విచక్షణారహితంగా దాడి చేయడం దుర్మార్గమని అన్నారు. ఈ దాడిలోనే రెండు నెలల పసికందు మరణించడం అత్యంత విషాదకరమని, దీనికి బాధ్యులైన వారిపై హత్య కేసు నమోదు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

పోలీసుల తీరుపై ఆగ్రహం:
బాధిత కుటుంబం ఫిర్యాదు చేయడానికి వెళ్తే, కనీసం కేసు నమోదు చేయకుండా వారిని వేధించిన పోలీసుల తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించి, నిందితులకు కొమ్ముకాసిన పోలీసు అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు మరియు నిందితులు జైలుకు వెళ్లే వరకు రజక సమాజం పోరాటాన్ని ఆపదని ఆయన హెచ్చరించారు. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా యావత్తు రజక లోకం ఏకమై బాధిత కుటుంబానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
ఈ నిరసన కార్యక్రమంలో రజక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొలిపాక సారయ్య, నాయకులు నల్ల బాలరాజ్, కొలిపాక శ్రీనివాస్, కొలిపగ రమేష్, కొండపాక పవన్, నల్ల సుమన్, సుంకరి మొగిలి, కొలిపక వెంకటేష్, కొండపాక లక్ష్మి, నిమ్మటూరి రమ, వసంత, భూలక్ష్మి, స్వరూప, కొలిపాక రంగయ్య పాల్గొన్నారు. అలాగే ప్రజాసంఘాల నాయకులు వేల్పుల ప్రభాకర్, తులసి లక్ష్మణమూర్తి, చిలకమారి శ్రీనివాస్, సాదుల రవీందర్, ఇప్పకాయల సాగర్ తో పాటు తదితరులు పాల్గొని తమ సంఘీభావాన్ని ప్రకటించారు.


కరీంనగర్- వరంగల్ ప్రధాన రహదారిపై ధర్నా రాస్తారోకో నిర్వహిస్తున్న రజక సంఘం నాయకులు, రజక కులస్తులు





