
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రైతులు నూతన వ్యవసాయ పద్ధతులను అవగాహన చేసుకోవాలని, శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని కరీంనగర్ ఆత్మ పిడి శత్రు నాయక్ అన్నారు. మంగళవారం హుజూరాబాద్ పట్టణంలోని ప్రతాప సాయిరెడ్డి గార్డెన్లో ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖల ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ రోంటాల సుహాసిని మాట్లాడుతూ రైతులు ఆయిల్ పామ్ సాగు చేపట్టి బంగారు రైతులు కావాలని అన్నారు. జమ్మికుంట కెవికే శాస్త్రవేత్త జీ.వేణు మాట్లాడుతూ….ఉద్యాన పంటల సాగు, అధునాతన పద్ధతులతో పండ్లు, కూరగాయలు, పూలు సుగంధ ద్రవ్యాల సాగు ముఖ్యంగా ఆయిల్ పామ్ సాగులో చేపట్టవలసిన మెళకువలు గురించి రైతులకు వివరించారు. ఉద్యాన శాఖ ద్వారా రైతులకు ఇచ్చే వివిధ పథకాల రాయితీలను హుజురాబాద్ డివిజన్ ఉద్యాన అధికారిని బి మంజువాణీ వివరించారు. ఆయిల్ పామ్ సాగు కొరకు ప్రభుత్వం ఎకరానికి రూ. 4200 రాయితీ ఇస్తుందనీ, డ్రిప్ పరికరాలు, కూరగాయలు, పండ్లు, పసుపు, అరటి పంటలకు ప్రభుత్వం రాయితీలు అందిస్తుందని తెలిపారు. తెలంగాణ ఆయిల్ ఫెడ్ సంస్థ జిల్లా కో ఆర్డినేటర్ నాయుడు రాధాకృష్ణ మాట్లాడుతూ… ఆయిల్ పామ్ పంట మార్కెటింగ్, గెలల కత్తిరింపులు గురించి వివరించారు. ఈ సందర్భంగా కూరగాయల విత్తనాల పంపిణీ, నూతన పంటలు సాగు చేస్తున్న రైతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ వ్యవసాయ శాఖ సహాయ సంచాలకురాలు గూండా సునీత, ఆత్మ చైర్మన్ కొన్ని స్వామి, సెరికల్చర్ ఏడి వెంకన్న, రషీద్, హుజురాబాద్ మండల వ్యవసాయ అధికారి భూమిరెడ్డి, గణేష్, ఖాదిర్, నిఖిల్ హుజురాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక, మరియు చిగురుమామిడి, సైదాపూర్ మండలాల రైతులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ రోంటాల సుహాసిని

హాజరైన రైతులు…

రైతులు పండించిన పంటలు తయారుచేసిన నూతన వంగడాలను పరిశీలిస్తున్న మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని, ఏడిఏ సునీత, ఇతర అధికారులు..

నూతన వంగడాలపై రూపొందించిన బ్రోచర్లను ఆవిష్కరిస్తున్న చైర్ పర్సన్ సుహాసిని, ఇతర అధికారులు..

ఆదర్శ రైతును సన్మానిస్తున్న చైర్పర్సన్ రోంటాల సుహాసిని, అధికారులు..





