
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) హుజురాబాద్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో పెండింగ్లో ఉన్న రూ.15,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్లాకార్డ్స్ ప్రదర్శించారు.


ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు గోస్కుల అజయ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో SC, ST, BC, EBC విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్యను అందించాలని, తద్వారా వారి కుటుంబాలను ఆర్థికంగా, సామాజిక ఉన్నతంగా నిలబెట్టాలనే ఉద్దేశ్యంతో గత ప్రభుత్వాలు తీసుకొచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రపన్నుతున్నదన్నారు. “రాష్ట్రంలో 20 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వం అందించే ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ లపై ఆధారపడి చదువుకుంటున్నారని, కానీ ప్రభుత్వం సరైన సమయంలో ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయని కారణంగా రూ.11000 కోట్ల బకాయిలు పేరుకు పోయాయన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రతి యేట 2 లక్షల మంది విద్యార్థులు డ్రాపౌట్ అవుతున్నారని, అనేక మంది సర్టిఫికెట్స్ తీసుకోలేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఇక్కడి విద్యార్థులు పక్క రాష్ట్రాలకు వలసవెళ్లే పరిస్థితి దాపురించిందన్నారు. గతంలో ఉన్న ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తుంగలో తొక్కుతూ పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేస్తున్నదని, మా ప్రభుత్వంలో బకాయిలు చెల్లించడంతో పాటుగా, గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి ప్రతి నెల ఫీజులు చెల్లిస్తామని చెప్పిన నేటి ముఖ్యమంత్రి తానే విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పటికీ ఇప్పటి వరకు బకాయిలు విడుదల చేయకపోవడంతో ఈ విషయం కోర్టు మెట్లు ఎక్కిందనీ అన్నారు.
ప్రైవేట్ కాలేజీలు ప్రభుత్వం కలిసి ఆడుతున్న నాటకంలో విద్యార్థులు బలి అవుతున్నారని, బడ్జెట్ కాలేజిలు సైతం మూతపడుతున్నాయని, పొట్టకూటి కోసం లెక్చరర్ గా మారిన నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని దీనికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమే అన్నారు. రీయింబర్స్ మెంట్, స్కాలర్షిప్స్ అనేవి విద్యార్థుల హక్కు అని ప్రభుత్వం వేసే బిక్ష కాదన్నారు. రీయింబర్స్మెంట్ కోసం అడిగితే విద్యార్థులపై ఉక్కుపాదం మోపుతున్నారని, నిరసన చేస్తే లాఠీచార్జీలు చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్నారని, కానీ తెలంగాణ విద్యార్థులకు ఇవి కొత్తేమీ కాదన్నారు. రేవంత్ రెడ్డి మాట తప్పారని, ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి అంకురార్పణ చేస్తామని, అన్ని కళాశాల ప్రాంగణాలు, విశ్వవిద్యాలయాలు మరోసారి ఉద్యమ వేదికలై కాంగ్రెస్ పార్టీకి మరణశాసనం రాస్తాయనీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శివ, అభిలాష్, మణి, కుమారస్వామి కార్యకర్తలు విద్యార్థులు పాల్గొన్నారు.
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు : ఆల్ ఫోర్స్ జీనియస్ స్కూల్, బండ అంకుస్ వాడ హుజురాబాద్, కరీంనగర్ జిల్లా.





