
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: తమకు గత ప్రభుత్వం కేటాయించిన నివేషణ స్థలాలపై కేసు వేసి ఇబ్బందులకు గురి చేస్తున్న కాంగ్రెస్ నాయకుడు స్వామిరెడ్డి వైఖరినీ నిరసిస్తూ బుధవారం హుజురాబాద్ లో జర్నలిస్టులు కదం తొక్కారు. తాసిల్దార్ కార్యాలయం ముందు జర్నలిస్టులు ప్రజాసంఘాల నాయకులు ఆందోళన నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కాయిత రాములు మాట్లాడుతూ…
గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీ క్యాంప్‌లో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరయ్యాయని తెలిపారు. జిల్లా కలెక్టర్, ఆర్డీవో ఉత్తర్వుల మేరకు మున్సిపల్ అధికారులు హౌస్ నంబర్లు కేటాయించగా, జర్నలిస్టులు లక్షలాది రూపాయలు వెచ్చించి గృహాలు నిర్మించుకున్నారని పేర్కొన్నారు. అయితే, హుజూరాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గూడూరు రాజేశ్వరి భర్త, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గూడూరు అంజలి మామ అయిన కాంగ్రెస్ నాయకుడు గూడూరు స్వామిరెడ్డి అక్కసుతో కోర్టులో కేసు వేశారని మండిపడ్డారు. మూడేళ్లుగా ఆ కేసును ఉప సంహరించుకోకుండా జర్నలిస్టులను తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రణవ్ బాబులకు వినతిపత్రాలు ఇచ్చినా పరిష్కారం లభించలేదని పేర్కొన్నారు. కేసు విత్‌డ్రా చేయిస్తామని గతంలో నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రణవ్ బాబు హామీ ఇచ్చినా అమలు కాలేదని విమర్శించారు. గూడూరు స్వామిరెడ్డి తన నిరంకుశ వైఖరిని వీడి వెంటనే కోర్టు కేసును ఉప సంహరించుకోవాలని, లేనిపక్షంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, ప్రజా సంఘాల నాయకులు చందుపట్ల జనార్ధన్, వేల్పుల రత్నం, మార్త రవీందర్, వేల్పుల ప్రభాకర్, దేవసాని ప్రియదర్శిని, సృజన, సందెల వెంకన్న, పలువురు జర్నలిస్టులు, వారి మద్దతుదారులు పాల్గొన్నారు.





