
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: జర్నలిస్టుల హక్కులపైనా, వారి నివేశన స్థలాలపైనా కక్షపూరితంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నాయకుడు గూడూరు స్వామిరెడ్డి తీరును నిరసిస్తూ హుజూరాబాద్‌లో ఆగ్రహజ్వాలలు మిన్నంటాయి. జర్నలిస్టులకు గత ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాలపై న్యాయస్థానంలో వేసిన కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని, సొంత పార్టీ మంత్రులను సైతం దుర్భాషలాడుతున్న స్వామిరెడ్డిని కాంగ్రెస్ నుంచి తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ హుజూరాబాద్ ప్రెస్ క్లబ్, ప్రజాసంఘాల ఉమ్మడి ఆధ్వర్యంలో గురువారం పట్టణంలో భారీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.
పట్టణ పురవీధుల గుండా సాగిన భారీ ర్యాలీతో హుజూరాబాద్ వీధులు హోరెత్తాయి. జర్నలిస్టులతో పాటు ప్రజాసంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామిరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

50 మంది విలేకరుల పొట్ట కొట్టే కుట్ర…
ఈ సందర్భంగా హుజూరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కాయిత రాములు, ప్రధాన కార్యదర్శి కామని రవీందర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎలాంటి సంబంధం లేకపోయినా కేవలం కక్ష సాధింపు ధోరణితోనే కోర్టును ఆశ్రయించి 50 మంది పేద విలేకరుల కడుపు కొట్టేందుకు స్వామిరెడ్డి దారుణమైన కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. గత 20 ఏళ్లుగా అద్దె ఇళ్లలో ఉంటూ అరకొర ఆదాయంతో దయనీయ జీవితాలు గడుపుతున్న పాత్రికేయుల స్థలాలను లాక్కోవాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. అధికార పార్టీలో ఉంటూనే మంత్రులకు, క్షేత్రస్థాయి నాయకులకు మచ్చ తెచ్చేలా ప్రవర్తిస్తున్న ఆయనపై పార్టీ అధిష్ఠానం తక్షణమే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.



బోగస్ బిల్లులు.. ప్రభుత్వ భూమి కబ్జా…
స్వామిరెడ్డిపై తీవ్రస్థాయిలో అక్రమాల ఆరోపణలు వెల్లువెత్తాయి. ఏ పని చేయకుండానే ఎంబి రికార్డులు సృష్టించి లక్షలాది రూపాయల ప్రభుత్వ బిల్లులు పొందుతున్నాడని నిరసనకారులు బహిరంగంగా ఆరోపించారు. అంతేకాకుండా, హుజూరాబాద్ పట్టణంలోని సర్వే నంబర్ 125లో గల దాదాపు 300 గజాల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్రమంగా తన వ్యక్తిగత కార్యాలయాన్ని నిర్మించుకున్నారని ధ్వజమెత్తారు. పనులు చేయకుండానే ఎంబి రికార్డులు సృష్టిస్తూ, ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించే ఇటువంటి వ్యక్తులు జర్నలిస్టుల స్థలాలపై కేసులు వేయడం విడ్డూరంగా ఉందని దుయ్యబట్టారు.
”జర్నలిస్టుల ఇళ్ల స్థలాల వ్యవహారంలో నిర్లక్ష్యం తగదు. రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ ప్రణవ్ బాబు తక్షణమే జోక్యం చేసుకుని ఈ కోర్టు కేసుల చిక్కుముడిని విప్పాలి. విలేకరులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదు.” అని ప్రెస్ క్లబ్ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కళాకారుల ఆటపాటలు.. దద్దరిల్లిన నిరసన..
ర్యాలీ అనంతరం నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో జర్నలిస్టుల హక్కులు, ఆత్మగౌరవంపై కళాకారులు ఆలపించిన ఉద్యమ గీతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వారి ఆటపాటలతో నిరసన ప్రాంగణం ఉద్యమ వాతావరణాన్ని తలపించింది.
ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు చందుపట్ల జనార్ధన్, వేల్పుల రత్నం, సందెల వెంకన్న, దేవసాని ప్రియదర్శిని, మాడుగుల ఓదెలు, సీనియర్ జర్నలిస్ట్ అంబాల ప్రభాకర్‌తో పాటు నియోజకవర్గ పరిధిలోని పాత్రికేయులు, ప్రజాసంఘాల నాయకులు, భారీ సంఖ్యలో పాల్గొని మద్దతు తెలిపారు. స్వామిరెడ్డి వైఖరి మారకపోతే ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా నాయకులు హెచ్చరించారు.
&&లోకల్ యాడ్స్ &&
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ బత్తుల మనోజ్ గారు అధ్యక్షులు సాహస హెల్ప్ సొసైటీ హుజురాబాద్ మరియు అలయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి హుజురాబాద్, కరీంనగర్ జిల్లా.





