
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:
అన్నదాతలకు, విద్యార్థులకు వివిధ కుల సంఘాలకు, ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో నిర్లక్ష్య ధోరణి విడనాడాలని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్ చేశారు. దాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రామారావు ఆరోపించారు.


మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ను బుధవారం హన్మకొండలోని వారి నివాసంలో ఈనెల 30న కరీంనగర్ లో రైతు ప్రజాసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి రైతుల మహా గర్జన సమరభేరి సభకు హాజరు కావాలని కోరుతూ రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు నేతృత్వంలో నాయకులతో కలిసి వారిని ఆహ్వానిస్తూ రైతు మహా గర్జన సమర భేరి సభ ఆహ్వాన పత్రికలను అందజేయగా సానుకూలంగా స్పందించి రైతు మహగర్జన సమరభేరి సభ గోడ పత్రికలను పోలాడి రామారావుతో కలిసి వినోద్ కుమార్ ఆవిష్కరించారు. కరీంనగర్ లో రైతు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మే 30న రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ల సాధనకు
నిర్వహించే సమర భేరి సభకు తమ సంపూర్ణ సహకారం అందిస్తామని తాను స్వయంగా సభకు హాజరవుతామని వినోద్ హామీ ఇచ్చినట్లు రామారావు తెలిపారు.



అనంతరం హన్మకొండలో జరిగిన రైతు సంగ్రామ సదస్సుకు హాజరైన వివిధ జిల్లాల రైతు ప్రజా సంఘాల నాయకులతో కలిసి హంటర్ రోడ్డులో రైతు మహా గర్జన సమర భేరి సభ గోడ ప్రతులను ఆవుష్కరించిన రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు మాట్లాడుతూ అన్నదాతలకు, విద్యార్థులకు వివిధ సామాజిక వర్గాలకు ఇచ్చిన హామీలపై ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి విడనాడాలని, తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోసగం మందికి మాత్రమే రుణ మాఫీ చేశారని మిగిలి ఉన్న అర్హత గల రైతుల రెండు లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులకు ఇచ్చిన అన్నీ హామీలను నెరవేర్చాలని, ఇచ్చిన హామీ మేరకు అన్ని రకాల పంటలకు 500 రూపాయల బోనస్ ఇవ్వకుండా కేవలం సన్న రకాలకు మాత్రమే అడపా దడపా అర కొరగా ఇస్తున్నారని, ఇప్పటికే రెండు సార్లు రైతు భరోసా నిధులను ఎగ్గొట్టిన ప్రభుత్వం నామ మాత్రంగానే నిధుల విడుదల చేసిన సర్కార్ కు రైతన్నల ఉసురు తగలక తప్పదని హెచ్చరించారు.
విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రైతు భీమా వయోపరిమితిని 59 ఏళ్ల నుంచి 70 ఏళ్లకు పెంచాలని, 50 ఏళ్లు నిండిన ప్రతి రైతుకు నెలకు ఆరు వేల రూపాయల పెన్షన్ సౌకర్యం కల్పించాలని, రైతులకు అన్నీ విభాగాల్లో 20 లక్షల ఉచిత వైద్య సౌకర్యం ఏర్పాటుకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, జాతీయ ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ రంగాన్ని అనుసంధానం చేయాలని,
రైతుకు గిట్టుబాటు ధర నిర్ణయించుకునే రైతుల భాగస్వామ్యం ఉండే రైతు చట్టం తేవాలని, పంటల సాగు సమయంలోనే రైతు భరోసా నిధులను విడుదల చేయాలనే తదితర డిమాండ్ల సాధనకు కరీంనగర్ జిల్లా కేంద్రంలో మే 30న రైతు ప్రజాసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రెండు లక్షల మందితో నిర్వహించే రాష్ట్ర స్థాయి రైతుల మహా గర్జన సభకు పార్టీల కతీతంగా హాజరై విజయవంతం చేయాలని పోలాడి రామారావు కోరారు.
ఈ కార్యక్రమంలో రైతు ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర జిల్లా నాయకులు యుగంధర్ రావు, మహేందర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, రామ్ యాదవ్, వెంకట్ రెడ్డి, అనిల్, లక్ష్మినారాయణ, వెంకటేశ్వర్ రావు, రాజగంగు, అంజయ్య, మాలొతు తిరుపతి లతో పాటు పలువురు వివిధ జిల్లాల, మండలాల నాయకులు పాల్గొని మహాగర్జన సమర భేరి సభ గోడ ప్రతులను ఆవిష్కరించారు.





