
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, మే 10: కాలం చక్రంలా తిరుగుతున్నా, కొన్ని జ్ఞాపకాలు మాత్రం పచ్చగానే ఉంటాయి. సరిగ్గా మూడు దశాబ్దాల క్రితం ఒకే తరగతి గదిలో పాఠాలు విని, ఒకే బెంచీపై కూర్చుని కలలు కన్న ఆ మిత్రులంతా మళ్లీ ఒకేచోట చేరారు. హుజూరాబాద్ స్థానిక విఎల్ఆర్ ఏసీ కన్వెన్షన్ హాల్ ఆదివారం నాటి ఈ అపురూప ఘట్టానికి వేదికైంది. హుజూరాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల 1995-97 ఇంటర్మీడియట్ బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కన్నుల పండువగా జరిగింది. ఈ కార్యక్రమానికి హుజురాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ రొంటాల సుహాసిని ముఖ్య అతిథిగా హాజరు కాగా ఇంటెలిజెన్స్ ఎస్పి పుల్ల కరుణాకర్, ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి బోల్లం తిరుపతి, ఓరుగంటి తిరుపతి వ్యాఖ్యతగా వ్యవహరించగా సీనియర్ విద్యార్థులు బుర్ర స్వామిగౌడ్, తిరుపతి, వడ్లకొండ అనిల్ కుమార్, నడిగడ్డ రాజు, రోంటాల సుధీర్, రాంపల్లి బిక్షపతిల ప్రత్యేక చొరవ తీసుకుని సమన్వయపరిచారు.


కార్యక్రమాన్ని నిర్దేశించి మాట్లాడుతున్న చైర్పర్సన్ సుహాసిని..(పైన) అధ్యాపకులతో పూర్వ విద్యార్థులు గ్రూప్ ఫోటో (కింద)
వివిధ వృత్తుల్లో స్థిరపడిన పాత మిత్రులందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడంలో వీరి కృషి అభినందనీయం. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను మరువకుండా గౌరవించుకున్నారు. అప్పటి అధ్యాపకులు ఎస్. మనోహరా చారి, చంద్రమౌళి, పేర్వరం శంకర్ రావు, నల్ల మహేందర్, అల్లం నర్సయ్య, తులసి దాస్, ఏం మొగిలయ్యలను శాలువాలతో ఘనంగా సత్కరించి, జ్ఞాపికలను అందజేసి కృతజ్ఞతలు చాటుకున్నారు. ఈ సందర్భంగా రొంటాల సుహాసిని మాట్లాడుతూ… తమ ఎదుగుదలకు పునాది వేసిన గురువుల ఆశీస్సులు తీసుకోవడం గర్వకారణమని విద్యార్థులు భావోద్వేగానికి లోనయ్యారు. చిన్ననాటి మిత్రులను కలవడం అనేది వెలకట్టలేని అనుభూతినిస్తుందని పేర్కొన్నారు. పదవులు, హోదాల కంటే స్నేహమే మిన్న అని, ఇలాంటి సమ్మేళనాలు మానసిక ఉల్లాసాన్ని ఇవ్వడమే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలకు వేదిక కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ తమ కళాశాల రోజులను గుర్తు చేసుకున్నారు. చిన్ననాటి అల్లరి, పరీక్షల భయం, ఆటపాటలు.. ఇలా ప్రతి జ్ఞాపకాన్ని నెమరువేసుకుంటూ పాత రోజుల్లోకి వెళ్ళిపోయారు. ప్రస్తుతం సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్నప్పటికీ, స్నేహితుల మధ్య మాత్రం తాము మళ్ళీ ఆనాటి విద్యార్థులమేనని చాటి చెప్పారు. విందు వినోదాలతో, సెల్ఫీలతో కన్వెన్షన్ హాల్ అంతా సందడిగా మారింది.





