
స్వర్ణోదయం ప్రతినిధి వరంగల్, జూన్ 7: గుర్తింపు పొందిన వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు జిల్లాలోని ప్రైవేట్ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 100 శాతం ఫీజు రాయితీ కల్పించాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజేయూ) వరంగల్ జిల్లా శాఖ జిల్లా కలెక్టర్‌ను కోరింది. టీయూడబ్ల్యూజేయూ జిల్లా కన్వీనర్ మిర్జా ఫతేహుల్లా బేగ్ నాయకత్వంలో జర్నలిస్టుల ప్రతినిధి బృందం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజలకు సమాచారాన్ని చేరవేయడంలో, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, జిల్లాస్థాయిలో పనిచేస్తున్న అనేక మంది జర్నలిస్టులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. పెరుగుతున్న విద్యా ఫీజుల కారణంగా తమ పిల్లల చదువుల భారాన్ని భరించడం కష్టంగా మారిందని,అందువల్ల గుర్తింపు పొందిన జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో పూర్తి ఫీజు మినహాయింపు కల్పించాలని కోరారు.ఈ వినతిపై స్పందించిన జిల్లా కలెక్టర్ సమస్యను సానుకూలంగా పరిశీలిస్తామని,దీనిపై త్వరలోనే తగిన చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.జిల్లా కలెక్టర్ సానుకూల స్పందనపై జర్నలిస్టు సంఘం ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ,జర్నలిస్టుల పిల్లల విద్యా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని త్వరితగతిన అనుకూల నిర్ణయం తీసుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ అబ్దుల్ రజాక్ అక్రమ్, మహమ్మద్ ఫాజలుల్ రెహ్మాన్ వాజిద్, మహమ్మద్ రియాజ్ఉద్దీన్, మహమ్మద్ నాయబ్ రసూల్, మొహమ్మద్ మోమిన్, మహమ్మద్ ముస్తాబా రాజా ఉర్ రెహ్మాన్, సయ్యద్ సిదిక్, మహమ్మద్ అమీర్ ముదసిర్ నాజ్, షేక్ జావిద్, షేక్ వాహేద్ తదితరులు పాల్గొన్నారు.





