Oplus_16908288
—తెలంగాణ వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం
—ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్
—బిఆర్ఎస్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎడవెల్లి కొండాల్ రెడ్డి
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: దేశానికే వెన్నుముకగా నిలిచిన తెలంగాణ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం దారుణమైన వెన్నుపోటు పొడిచిందని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, బీఆర్ఎస్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, సింగిల్ విండో చైర్మన్ ఎడవల్లి కొండాల్ రెడ్డిలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం హుజరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బిఆర్ఎస్ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.

కేంద్రం నిర్దేశించిన కోటా మేరకే పంటలు కొనుగోలు చేస్తామని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనంగా ఒక్క గింజ కూడా కొనబోమని ప్రకటించడం రైతుల పట్ల అత్యంత దారుణమైన నిర్ణయమని వారు విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు రైతులు ఎన్నో కష్టాలు పడ్డారని, సాగునీరు, విద్యుత్ సమస్యలతో వ్యవసాయం కన్నీటి సేద్యంగా మారిందని గుర్తు చేశారు. రైతుల కష్టాలను గుర్తించిన కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని కేంద్రబిందువుగా చేసుకుని అనేక చారిత్రాత్మక కార్యక్రమాలు అమలు చేసిందన్నారు.
కేసీఆర్ పాలనలో రైతుకు భరోసా – కాంగ్రెస్ పాలనలో నిరాశ..
మిషన్ కాకతీయ ద్వారా వేలాది చెరువులను పునరుద్ధరించడం, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాల ద్వారా రైతుకు ఆర్థిక భరోసా కల్పించడం బీఆర్ఎస్ ప్రభుత్వ ఘనత అని తెలిపారు. రైతుబంధు కింద రూ.72 వేల కోట్లు, రుణమాఫీకి రూ.29 వేల కోట్లు, రైతుబీమాకు రూ.6,800 కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేశామని పేర్కొన్నారు. దేశ చరిత్రలో తొలిసారిగా 24 గంటల ఉచిత విద్యుత్ అందించి వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని, దాని ఫలితంగానే తెలంగాణ దేశానికే అన్నపూర్ణగా మారిందన్నారు.
—రైతుబంధు పెంపు హామీ మరిచిన రేవంత్ రెడ్డి…
ఎన్నికల సమయంలో రైతుబంధును రూ.15 వేలకు పెంచుతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాట నిలబెట్టుకోలేదని విమర్శించారు. రైతుబీమా ప్రీమియంలు సకాలంలో చెల్లించక వేలాది రైతు కుటుంబాలను ఇబ్బందులకు గురి చేసిందన్నారు. యూరియా కొరతను సృష్టించి రైతులను నెలల తరబడి క్యూల్లో నిలబెట్టిందని ఆరోపించారు. పండించిన పంటను కొనుగోలు చేయకుండా రైతులను కొనుగోలు కేంద్రాల వద్దే రోజులు తరబడి వేధించారని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అనేక మంది రైతులు తీవ్ర మనోవేదనకు గురయ్యారని అన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు కల్లాల వద్దకే వెళ్లి చివరి గింజ వరకు కొనుగోలు చేసిందని, మొక్కజొన్న, జొన్న, శనగ, పెసలు, కందులు, సోయాబీన్ తదితర పంటలను కూడా మద్దతు ధరకు సేకరించిందని గుర్తు చేశారు.
—పీసీసీ అధ్యక్షుడిగా ఒక మాట.. ముఖ్యమంత్రిగా మరో మాట..
పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అన్ని పంటలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఎందుకు చేతులెత్తేస్తున్నారని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని, బోనస్ కూడా ఇస్తామని ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. కేంద్రం నిర్ణయించిన పరిమితి వరకు మాత్రమే పంటలు కొనుగోలు చేస్తామని చెప్పడం రైతులను దళారుల చేతుల్లోకి నెట్టడమేనని విమర్శించారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడకుండా బాధ్యతల నుంచి తప్పించుకోవడం సిగ్గుచేటన్నారు.
పోరాటానికి సిద్ధం అవుతున్న బీఆర్ఎస్
తెలంగాణ రైతులు పండించే ప్రతి పంటను చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ, ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రైతులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా మరో ఉద్యమానికి బీఆర్ఎస్ శ్రీకారం చుడుతుందని ఎడవల్లి కొండాల్ రెడ్డి హెచ్చరించారు. తెలంగాణను వ్యవసాయ విప్లవానికి కేరాఫ్ అడ్రస్‌గా మార్చిన బీఆర్ఎస్ పాలనను ప్రజలు గుర్తుంచుకున్నారని, రైతు వ్యతిరేక విధానాలు కొనసాగిస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులే తగిన గుణపాఠం చెబుతారని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంఘం ఐలయ్య, నాయకులు మండ సతీష్, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, తులసి లక్ష్మణమూర్తి, కొలిపాక సమ్మయ్య, ఏం రాజ్ కుమార్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.





