
—పంటల కొనుగోళ్లలో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్
—హామీలు అమలు చేయకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం చెల్లించక తప్పదు
–-రైతు, ప్రజా సంఘాల జేఏసీ నేత పోలాడి రామారావు
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హనుమకొండ: ఎన్నికల సమయంలో ఇఛ్చిన హామీలను మరచిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని రైతు ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ఆరోపించారు.

హన్మకొండ జిల్లా కేంద్రంలో ఓ హోటల్ లో ఆదివారం విలేఖరుల సమావేశంలో ప్రజా సంఘాల నాయకుల తో కలిసి పోలాడి రామారావు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఎన్ని వడ్లు పండించినా, ఏ రకం దాన్యాన్నైనా చివరి గింజ వరకు పూర్తిగా కొంటామని, అన్ని పంటలకు మద్దతు ధరతో పాటు 500 రూ. బోనస్ ఇస్తామని ప్రకటించి అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాట మార్చిందని ఆరోపించారు.
పాత విధానానికి స్వస్తి పలికి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కోటా ప్రకారం అంతే దాన్యం కొంటామని, అంతకు మించి కొనలేమని రేవంత్ సర్కార్ చేతులేత్తేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఏడు రకాల సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పడం ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనమన్నారు. రైతులను వివక్షతో దగా చేయడం దారుణమని మండి పడ్డారు. రాష్ట్రంలో వ్యవసాయ విస్తీర్ణం పెరిగినప్పటికి దానికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రైతుల వరిధాన్యం కొనుగోళ్లపై పరిమితి విధించి మార్కెట్ యార్డు దయాదాక్షిణ్యాలకు వదిలేస్తే అన్నదాతలు ఆగమవుతారని ఆందోళన వ్యక్తం చేశారు.
రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా, పంటల కొనుగోళ్లపై బోనస్, నీటి సరఫరా, కరెంట్ సరఫరాలపై కోతలు విధించి రైతులకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను విస్మరించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యూరియా బస్తాలు సరిగా సరఫరా చేయడం లేదన్నారు. ఎకరానికి రెండు బస్తాలు ఇస్తారట ఇప్పుడు ఒక బస్తా ఇస్తే వచ్చే నెలలో ఒక బస్తా తీసుకోవాలట అవి కూడా యాప్ ల ద్వారా తీసుకోవాలని నిబంధనలు పెట్టడం చదువు రాని స్మార్ట్ ఫోన్లు లేని రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.
ప్రస్తుత వాతావరణ పరిస్థితి ఎలినోవా ప్రభావం ఉండటంతో వర్షాలు ఆలస్యం అవుతున్నందున భూగర్భ జాలాల పైన ఆధార పడిన రైతుల కోసం వ్యవసాయం చేసుకోవడానికి 18 గంటల నిరంతర విద్యుత్ ఆందించాలని డిమాండ్ చేశారు.
రైతులను భయ బ్రాంతులకు గురి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వెంటనే భేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని రామారావు డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా మరణించిన రైతు బీమాకు అర్హులైన 7,600 మంది రైతులకు రైతు బీమా అందించ లేదన్నారు.

ఇప్పటికే మూడు విడతల రైతు భరోసా నిధులు రూ.16,545 కోట్ల బకాయిలు పెండింగులో ఉన్నాయన్నారు. ప్రస్తుత వానాకాలం సీజన్ భరోసా డబ్బులతోపాటు పెండింగ్ బకాయిలు మొత్తం కలిపి 29,358 కోట్ల రూపాయలను 30న సీఎం రేవంత్ మధిర లో నిర్వహించే సభావేదిక ద్వారా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.
గత యాసంగి సీజన్లో రైతులు పండించిన ధాన్యపు కొనుగోళ్లలో కేంద్రం వాటా మూడవ వంతు మాత్రమే కాగా కొనుగోలు కేంద్రాల్లోని దాన్యాన్ని 40 రోజులు ఆలస్యంగా ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి కొంటున్న సమయంలోనే మార్కెట్లో ప్రైవేట్ వ్యాపారులు ధరలు తగ్గించి కొనుగోలు చేస్తుండగా, ఇకమీదట అత్యధిక పంట ఉత్పత్తులను మార్కెట్లోనే తరలించాల్సి వస్తే ప్రైవేట్ వ్యాపారులు, దళారులు చెప్పిన ధరలకు రైతులు అమ్ముకొని తీవ్రంగా నష్టపోతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం తెలంగాణరాష్ట్రం నుంచి తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో సహా బంగ్లాదేశ్, మలేషియా, శ్రీలంక, తదితర దేశాలకు 35 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా బియ్యం ఎగుమతి జరుగుతుందన్నారు. మార్కెఫెడ్ ద్వారా మొక్కజొన్న, పెసలు, కందులు, సోయాబిన్, తదితర పంటలు కొంటున్నట్లుగా, ఇదే తరహాలో మార్కెఫెడ్ ద్వారా రైతుల వరిధాన్యం కొనుగోలు చేసి బియ్యంగా మార్చి కేంద్ర అనుమతితో ఇతర దేశాలకు ఎగుమతి చేస్తే రైతులకు మేలు జరుగుతుందన్నారు.
రైతులకు ఇచ్చిన హామీల అమలుపై డిమాండ్ల సాధనకు రైతు సమర భేరి సభ నిర్వహణలో ఆలస్యమైనా రైతులను చైతన్యవంతం చేసి పోరుబాట పట్టించడంలో, ప్రతిపక్షాలను మొద్దు నిద్ర నుంచి మేల్కొలిపి ఆందోళనలు చేయించడంలో, ప్రభుత్వం లో కదలిక తేవడం లో తమ రైతు ప్రజా సంఘాల జేఏసీ చురుగ్గా కీలక పాత్ర పోషించిందన్నారు. ప్రభుత్వం పై అలుపెరుగకుండా ఇచ్చిన హామీలు అమలుపరిచే వరకు ప్రజా సంఘాల జేఏసీ తరపున పోరుబాట చేసి రైతులకు అండగా ఉంటామని పోలాడి రామారావు భరోసానిచ్చారు.
ఈ కార్యక్రమంలో బహుజన కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కన్నం లక్ష్మణ్, ప్రజా సంఘాల రాష్ట్ర నాయకులు చందుపట్ల నర్సింహారెడ్డి, రాయపాటి వెంకటేశ్వర్ రావు, చకిలం రాజేశ్వర్ రావు, సాయికుమార్, గోపాల్ రావు తదితరులు పాల్గొన్నారు.

విలేఖరులతో మాట్లాడుతున్న రైతు, ప్రజా సంఘాల జేఏసీ నేత పోలాడి రామారావు..





