
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈనెల 24వ తేదీన ఎమ్మెల్యేల క్యాంపు ఆఫీసుల ముందు ధర్నాలు నిర్వహిస్తామని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ తెలిపారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ కరీంనగర్ జిల్లా కమిటీ సమావేశం ఏండిగా రవీందర్ రావు అధ్యక్షతన, హుజురాబాద్ మండల కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించారు.

ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన కొప్పుల శంకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ, గ్రామపంచాయతీ కార్మికులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని, ఎన్నికల ముందు తన మేనిఫెస్టోలో పంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేస్తామని ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి, ఇప్పటికీ అనేక మార్లు ప్రభుత్వం దృష్టికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి దృష్టికి, విన్నపాలు చేసినప్పటికీ ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని, పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల కనీస వేతనం 26 వేల రూపాయలు చెల్లించాలని, పీఎఫ్ ఈఎస్ఐ ప్రమాద బీమా సదుపాయం అందించాలని అనేక ఏళ్ల తరబడి పోరాడుతున్నప్పటికీ ప్రభుత్వాలు మారుతున్న గాని పంచాయతీ కార్మికుల జీవితాలలో, జీతాలలో ఎలాంటి మార్పు రాలేదని ఆరోపించారు. పల్లెలను శుభ్రంగా ఉంచి గ్రామీణ ప్రజలకు నిరంతరం సేవలందిస్తున్న పంచాయతీ కార్మికుల శ్రమను ప్రభుత్వం గుర్తించకపోవడం దుర్మార్గమని, ఇచ్చేదే రూ.9500 వేతనం దానిని కూడా ప్రతి నెల ఇవ్వకుండా రెండు నెలలు ఆరు నెలలకు ఒకసారి చెల్లిస్తుందన్నారు.
పత్రికలలో, మీడియా ఛానల్లో మాత్రం, ప్రతి నెల ఒకటో తారీకు వేతనాలు చెల్లిస్తాం, ప్రభుత్వమే ప్రతి నెల పంచాయతీ కార్మికులకు 50 కోట్ల బడ్జెట్ కేటాయిస్తమని భారీగా ప్రకటనలు ఇచ్చుకొని కార్మికులను మోసం చేయడం తప్పితే ఇంకోటి కాదన్నారు.
రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు దశలవారీగా ఆందోళనలు చేపడుతున్నామని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే చలో ప్రజా భవన్ ముట్టడీ చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కాశిపాక శంకర్, ఎలుకపెళ్లి సారయ్య కమిటీ సభ్యులు, వడ్లురి లక్ష్మీనారాయణ, బోయిని స్వరూప, రుద్రారం నాంపల్లి, రామగిరి మల్లయ్య, బండ సమ్మయ్య, ఎల్లయ్య, ఇమ్మటి శ్రీకాంత్, చొప్పదండి బిక్షపతి, ఆకునూరు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్





